Naveen Kumar, News18, Nagarkurnool
నేటి యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్న దృఢసంకల్పంతో వారి నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. యుక్త వయసులోనే సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో వ్యాపారాలు ప్రారంభించి రాణిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలోని ఐదుగురు స్నేహితులు పృధ్వి, నరేష్, ఎండి అస్లాం ఖాన్, పవన్, నిఖిల్, శ్రావణ్ కుమార్ కలిసి ఒక చిన్న పరిశ్రమను ప్రారంభించారు. క్లాత్ బ్యాగులను తయారుచేసే కంపెనీని ఏర్పాటు చేసి వారితో పాటుగా మరికొందరికీ ఉపాధిని కల్పిస్తున్నారు.
కరోనా సమయంలో ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారడంతో ఐదుగురు స్నేహితులు వాటిని వదిలేసారు. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం ద్వారా జీవితంలో ఆర్థికంగా ఎదగవచ్చని గుర్తించారు. వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఈ క్లాత్ బ్యాగ్ ఇండస్ట్రీని ప్రారంభించారు. తాము చేసే వ్యాపారం తమకు లాభాలు గడించడంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్మాల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. క్లాత్ బ్యాగ్స్ తయారు చేసే ఇండస్ట్రీని నెలకొల్పి తమతో పాటు మరో నలుగురికి ఉద్యోగాలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం పర్యావరణన్నీ కాపాడేందుకు ప్రభుత్వం ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తుంది. గ్రామ పంచాయతీల నుంచి మహానగరాల వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్లాస్టిక్ బ్యాగులను అరికడితే వాటి స్థానంలో క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రచారాలు కూడా చేస్తున్నారు. దీనిని గుర్తించిన ఈ యువకులు క్లాత్ బ్యాగ్ తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేస్తే మంచి లాభాలు ఉంటాయని గ్రహించారు. అనుకున్నదే తడవుగా కుటుంబ సభ్యుల సహకారంతో రూ. 40 లక్షల పెట్టుబడితో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో "నావిక్ క్లాత్ బ్యాగ్ ఇండస్ట్రీని" ఏర్పాటు చేశారు.
ఈ ఇండస్ట్రీలో మొత్తం 5 రకాల క్లాత్ బ్యాగులను తయారు చేస్తున్నారు. పర్యావరణనికి ఎలాంటి హాని కలిగించని క్లాత్ బ్యాగులను కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రచారాన్ని కూడా చేపడుతున్నారు. ఈ ఇండస్ట్రీని స్థాపించేందుకు చైనా నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ముద్రా లోన్ ద్వారా కొంత మొత్తాన్ని సేకరించి ఇండస్ట్రీ నెలకొల్పినట్లు నిర్వాహకులు పృధ్వి వివరించారు. నాణ్యతను బట్టి కేజీ క్లాత్ బ్యాగ్ ధర రూ. 200 నుంచి రూ. 220 వరకు ధర నిర్ణయించామని చెప్పుకొచ్చారు. సొంతంగా వ్యాపారం చేయడంతో మంచి లాభాలు గడించడంతోపాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి కలుగుతుందని వివరించారు. నావిక్ ఇండస్ట్రీ ఫోన్ 919603336712.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana