(N. Naveen Kumar, News 18, Nagarkurnool)
ఆసియా ఖండంలో సైఫన్ (Siphon) విధానం ద్వారా ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసే ఏకైక ప్రాజెక్టుగా సరళా సాగర్ (Sarala sagar) ప్రఖ్యాతి గాంచింది. గత మూడేళ్ళ కాలంలో వరదల సమయంలో ఈ ప్రాజెక్టులో సైఫన్లు తెరుచుకుంటూనే ఉన్నాయి. దాదాపు 70 ఏళ్ల క్రితమే ఎటువంటి విద్యుత్ (Power) అవసరం లేకుండా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ సరళాసాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు. వనపర్తి (Vanaparti) సంస్థనాధీశుల కాలంలో సరళా సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 1949 సెప్టెంబర్ 15న వనపర్తి చివరి సంస్థాన రాజు రాజారామేశ్వరరావు వనపర్తి ప్రాంత ప్రజలకు సాగు నీటిని అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో రూ.35 లక్షలు ఖర్చుచేసి 1959 మే 15 పూర్తి చేశారు. 1959 జూలై 26న మొదటిసారిగా అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి నరసింగరావు కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
నీటి సామర్ధ్యాన్ని బట్టి తెరుచుకునే గేట్లు:
ఆటోమేటిక్ సైఫన్ (Siphon) సిస్టంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 1960లో మొదటిసారిగా సైఫన్లు తెరుచుకొని నీరు దిగువకు విడుదలైంది. ఆతర్వాత వరుసగా మూడేళ్లు భారీ వర్షాలు కురియడంతో 1963 వరకు సైఫన్లు ఓపెన్ అయ్యాయి. 1964లో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా శంకర్ సముద్రం ప్రాజెక్ట్ ఆనకట్టలు తెగిపోయి వరద నీరు సరళ సాగర్‌కు చేరుకోవడంతో సరళాసాగర్ ఆనకట్ట కూడా తెగిపోయింది. దీంతో తరువాతి కాలంలో నీటి ఉధృతిని తట్టుకునేందుకు అలుగును ఏర్పాటు చేశారు. అనంతరం 1967 నుంచి 1970 వరకు వరదల సమయంలో సైఫన్లు తెరుచుకున్నాయి. తిరిగి 1974 నుంచి 1981 వరకు 1988, 90, 91, 93, 98లో ఈ సైఫన్లు తెరుచుకున్నాయి. 2009లో తెరుచుకున్న సైఫన్లు తిరిగి 11 ఏళ్ల తర్వాత 2019లో కురిసిన భారీ వర్షాలకు తెరుచుకున్నాయి. అయితే ఆ ఏడాది సరళా సాగర్ ప్రాజెక్టుకు నీటి వరద పెరగడంతో కట్ట తెగిపోయి నీరంతా నదిలోకి చేరుకుంది.
సరళ సాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం: 70 ఏళ్ల క్రితమే ఆసియా ఖండంలోని వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్.. నేటికీ వినియోగంలో ఉండడం ఆశ్చర్యపరిచే విషయం. సరళసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 0.5 టీఎంసీలు ఉండగా 771 ఎకరాల్లో 1372 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులు ఉండగా నీటి సామర్ధ్యం 1089.25 అడుగులకు చేరుకుంటే సైఫన్(Siphon) ఆటోమెటిగ్గా ఓపెన్ అవుతాయి. 1095 అడుగులకు నీరు చేరితే ప్రాజెక్టులో అన్ని సైఫన్లు ఓపెన్ అవుతాయి. ప్రాజెక్టు బెడ్ లెవెల్ 1054 అడుగులు ఉండగా 1067 అడుగులకు నీరు చేరితే ఎడమ కాలువ ద్వారా, 1072 అడుగులకు నీరు చేరితే కుడికాలువ ద్వారా నీరు దిగువకు విడుదల అవుతుంది. ఎడమ, కుడి కాలువలు ద్వారా 82 క్యూసెక్కుల నీరు విడుదలై 16 కిలోమీటర్ల పాటు ప్రవహించి ఎనిమిది గ్రామాల్లోని 3,769.20 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. కుడికాలువ ద్వారా 6.89 క్యూసెక్కులు నీరు విడుదలై 4.5 0 కిలోమీటర్ల పాటు ప్రవహించి 2 గ్రామాల్లోని 388.2 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. ఈ ప్రాజెక్టులో 17 హెడ్ సైఫన్లు, 4 ప్రైమ్ సైఫండ్లు ఏర్పాటు చేశారు.
సరళా సాగర్ సైఫన్ సిస్టం గేట్లు;
ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరిగితే ఆటోమేటిక్‌గా నీరు బయటకు విడుదల కావడం కోసం సరళ సాగర్ ప్రాజెక్టులో సైఫన్ సిస్టన్ని ఏర్పాటు చేశారు. 17 హెడ్ సైఫన్లు, 4 ప్రైమ్ సైఫన్లు ఈ ప్రాజెక్టులో ఏర్పాటు చేశారు. ఏనుగుతోండం ఆకారంలో ఉండే ఒక్క హెడ్ సైఫన్ ద్వారా 3,444 క్యూసెక్కుల నీటి చొప్పున అన్ని సైఫన్లు తెరుచుకుంటే 58,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది. ఒక్కొక్క ప్రైమ్ సైఫన్ ద్వారా 500 క్యూసెక్కుల నీరు, 4 ప్రైమ్ సైఫన్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులు ఉండగా 1089. 25 అడుగులకు నీరు చేరుకుంటే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. ప్రతి 0.25 అడుగులు పెరిగే కొలది ప్రాజెక్టులో 3 హీద్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ తెరుచుకుంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు 1089.25 అడుగులకు నీరు చేరుకోవడంతో 3 హెడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ద్వారా 1089 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది.
10 గ్రామాల్లో 42 వేల ఎకరాలకు నీరు:
సరళా సాగర్ ప్రాజెక్టు ద్వారా కొత్తకోట, మదనాపురం మండలంలోని మొత్తం 10 గ్రామాలకు సాగునీరు చేరుతుంది. ఎడమ కాలువ ద్వారా మదనాపురం మండలంలోని శంకరమ్మ పేట, దంతనూరు, మదనపురం, తిరుమలాయపల్లి, రామన్పాడు, అజ్జకోలు, కొన్నూరు, నర్సింగాపురం గ్రామాల్లోని 3769.2 0 ఎకరాలకు, కొత్తకోట మండలంలోని రామంతపురం, చర్లపల్లి గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.