హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది: ఆల్మట్టి నుంచి పోటెత్తుతున్న వరద 

Nagarkurnool: జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణా నది: ఆల్మట్టి నుంచి పోటెత్తుతున్న వరద 

జూరాల నదిలోకి భారీ వరద నీరు

జూరాల నదిలోకి భారీ వరద నీరు

 రాష్ట్రంలో కురుస్తున్న వర్ష ప్రభావంతో ప్రస్తుతం జూరాలలో ఇన్ ఫ్లో 92000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,07,000 క్యూసెక్కులుగా నమోదు అయింది. పవర్ హౌజ్‌లో 2 యూనిట్ల ద్వార విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు

(Naveen, News 18, Nagarkurnool)

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలోకి కృష్ణానీరు ప్రవేశిస్తుంది. పశ్చిమ కనుమల నుంచి ప్రారంభమవుతున్న కృష్ణనది వరద..మొదటగా కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ చేరుకుంటుంది. అక్కడి నుంచి నారాయణపుర ప్రాజెక్ట్‌లోకి వరద నీరు ప్రవేశిస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకున్న అనంతరం కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో అక్కడి నుంచి దాదాపుగా 2 రోజుల అనంతరం తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్‌కు చేరుకుంటాయి కృష్ణ జలాలు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో గల శ్రీశైలం ప్రాజెక్ట్‌కు నీరు చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిగా నిండిన అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేస్తారు.

కర్ణాటకలోని ప్రాజెక్ట్ సామర్థ్యం:

కర్ణాటకలో కృష్ణానదిపై ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లను నిర్మించారు. వీటిలో ఆల్మట్టి ప్రాజెక్ట్‌ను 1705 అడుగుల ఎత్తుతో 129.72 టీఎంసీల కెపాసిటీతో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రాజెక్టులో 92.05 టీఎంసీల నీరు నిల్వఉంది. ఆల్మట్టి డ్యాంకు జులై 13 నాటికి ఇన్ ఫ్లో 1,25,000 క్యూసెక్కులు నమోదవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. నారాయణపుర ప్రాజెక్ట్‌ను 1615 అడుగుల ఎత్తులో 37.64 టీఎంసీల కెపాసిటీతో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 33.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో నారాయణపుర ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,25,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,33,200 క్యూసెక్కులుగా నమోదవుతుంది.

జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం:

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువున కర్ణాటక నుంచి జూరాలకు వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్ట్‌ను 1045 అడుగుల ఎత్తులో 9.66 టీఎంసీల కెపాసీటీతో నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం, సాగు, తాగు అవసరాల కోసం నీటిని వినియోగిస్తారు. జూరాల ద్వారా నెట్టెంపాడు, కోయిల సాగర్, భీమా ప్రాజెక్ట్‌లకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం జూరాలలో 6.88 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 92,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,07,000 క్యూసెక్కులు నమెదవుతుంది. వీటిలో విద్యుత్ ఉత్పత్తి కోసం 11,195 క్యూసెక్కుల నీటిని పవర్ హౌజ్‌కు విడుదల చేస్తున్నారు. బీమా లిఫ్ట్-1కు 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా కుడి కాలువ ద్వారా 20 క్యూసెక్కులు, ఎడువ కాలువ ద్వారా 640 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

కేవలం 9.66 టీఎంసీ కెపాసిటీతో జూరాల ప్రాజెక్ట్:

జూరాల ప్రాజెక్ట్‌ను కేవలం 9.66 టీఎంసీల కెపాసీటీతో నిర్మించారు. దశాబ్దాల కాలంగా ప్రాజెక్ట్‌లో పూడిక తీయకపోవడంతో సిల్ట్ చేరుకొని ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్ధ్యం తగ్గిపోయింది. పూర్తిస్థాయిలో నీరు చేరుకున్నప్పటికి 6.8 టీఎంసీల కంటే ఎక్కవగా నీరునిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిల్వ సామర్ధ్యం తక్కువగా ఉండటంతో లక్షల క్యూసెక్కులలో వచ్చే వరద నీటిని వచ్చిన నీరు వచ్చినట్టుగా నదిలోకి స్పిల్ వే (గేట్లు) ద్వారా విడుదల చేస్తున్నారు. నిల్వ ఉన్న కొద్దిపాటి నీటితోనే నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్ట్‌లకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తారు. దీంతో వర్షకాలం సీజన్ ముగిసిన తరువాత ప్రాజెక్ట్‌లో సాగు, తాగు నీటిని పొదుపుగా నీటిని వినియోగించుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రాజెక్టు దిగవున రైతులకు హెచ్చరిక: జూరాల ప్రాజెక్ట్ ఈఈ జుబేర్ ( ఫోన్: 9550872847)

" కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్ నుంచి వరద నీరు వస్తుంది. దాదాపు లక్ష క్యూసెక్కుల మేర జూరాలో ఇన్ ఫ్లో వస్తుండగా అవుట్ ఫ్లో సైతం అదే స్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానికి రైతులకు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశాము. నీటిని నదిలోకి విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లను చేపట్టాము. వరద ప్రవాహనికి అనుగుణంగా ప్రాజెక్ట్ గేట్లు తెరిచి నీటిని నదిలోకి విడుదల చేస్తాము" అని జూరాల ప్రాజెక్ట్ ఈఈ జుబేర్ పేర్కొన్నారు.

First published:

Tags: Krishna River, Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు