(N.Naveen Kumar,News18,Nagarkurnool)
తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖమ్మంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహించి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది.
అప్పటినుంచి తెలంగాణ వ్యాప్తంగా చిన్నచిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న టిడిపి పార్టీ ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇంటింటికి టిడిపి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా ప్రజలను కలుసుకుని వీటితోపాటు క్యాడర్ను బలోపేతం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్లపాటు అధికారంలో టిడిపి ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టిడిపికి కంచుకోటలో ఉండేది. దాదాపుగా 9 నుంచి 10 వరకు ఎమ్మెల్యే సీట్లు టిడిపి పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉండేది. నాగర్ కర్నూల్ , దేవరకద్ర, అచ్చంపేట, వనపర్తి , మహబూబ్నగర్ జిల్లాల్లో టిడిపి పార్టీ బలంగా ఉండేది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్నాళ్లకు ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టిడిపి సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది.
ఇందులో భాగంగానే నాగర్కర్నూల్ జిల్లాలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి టిడిపి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలను ఆ పార్టీ పరిపాలనలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. వీటితో పాటుగానే టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.. మళ్లీ భవిష్యత్తులో తెలంగాణలోకి టిడిపి అధికారంలోకి వస్తే ఆ తరహా పాలనే ఉంటుందని ఒక ప్రచారాన్ని చేపడుతూ వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకున్న క్యాడర్ను బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికల్లో తమ సత్తామని ఆ పార్టీ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం వెళ్ళబుచ్చుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, TDP, Telangana