Naveen Kumar, News18, Nagarkurnool
మానవత విలువలు మంట కలిసి పోతున్నాయి. డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులని కడతేర్చేటువంటి కొడుకులు దర్శనమిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బు వ్యామోహంలో ఆ డబ్బును సొంతం చేసుకునే ఆశలో పడి రక్తసంబంధీకులను సైతం హత్యలు చేస్తున్న ఘటనలు చాలా వరకు నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar District) లో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోన్ బీరమ్మ అనే మహిళను కన్నకొడుకు డబ్బుల కోసం హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన తల్లిని ఎవరో చంపారని అమాయకుడిగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి అసలు నిజాన్ని బయటపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త మొలగర గ్రామానికి చెందిన బాల మసయ్యతో 25 ఏళ్ల క్రితం బీరమ్మ (48) వివాహమైంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 20 ఏళ్ల కిందట బాల మసయ్య కొత్తమూల్గరలో హత్యకు గురయ్యాడు. దీంతో బీరమ్మ తన ఇద్దరు పిల్లలతో తల్లిగారి గ్రామమైన మద్దిగుండ్లకు చేరుకుంది. కూలి పనులు చేసుకుని జీవిస్తూ కుమార్తె పెళ్లి చేసింది. ఆ తర్వాత భర్త తరపున వచ్చిన కొంత భూమిని ఇంటి స్థలాన్ని విక్రయించగా వచ్చిన మూడు లక్షల 75 వేల రూపాయలను వడ్డీకి అప్పుగా ఇచ్చుకుంటూ వచ్చిన వడ్డీతో జీవనం కొనసాగిస్తుంది. కుమారుడైన బీరయ్యకు ఏడాది క్రితం నవాబ్పేట మండలంలోని కూచూరు గ్రామానికి చెందిన చిట్రోల బీరయ్య కుమార్తె మౌనికతో పెళ్లి చేసింది. అనంతరం బీరయ్య ఇల్లరికం వెళ్లి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు.
ఈ క్రమంలో బీరయ్య మామ అయిన చిటోల్ల బీరమ్మకు రూ.50,000 అప్పు ఇచ్చింది. ఆ డబ్బును ఇటీవల వసూలు చేసుకుంది. ఈ నెల 1న మద్దికుంట నుంచి వచ్చిన కొడుకు బీరయ్య ఇచ్చిన డబ్బులలో తనకు రూ.30,000కావాలని తల్లిని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశానికి గురైన అతడు రోకలిబండతో ఆమె తలపై మోదాడు. దీంతో అక్కడికక్కడే తల్లి మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమె దగ్గరున్న సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని తన అత్తగారి ఊరైన కుచ్చునూరుకు వెళ్లిపోయాడు.
అదే రోజు అర్ధరాత్రి పక్కింటి వారికి ఫోన్ చేశాడు. వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడంతో గురువారం మళ్లీ ఫోన్ చేసి అమ్మ ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు. వారు బీరమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె మృతి చెంది ఉండడం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సిఐ రజిత రెడ్డి, ఎస్సై భాస్కర్ రెడ్డి పోలీసులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బీరయ్యని పిలిచి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana