Home /News /telangana /

NAGAR KURNOOL SNAKE BITES CAUSE MORE DEATHS IN NAGARKUNROOL DISTRICT BRV ABH NNK

Nagarkurnool: పాము కాటుకు మరో రైతు బలి!..

పాము కాటుకు మరో రైతు బలి

పాము కాటుకు మరో రైతు బలి

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కొత్తగాండ్ల తండాకు చెందిన రైతు టోపియా నాయక్ (51) గురువారం ఉదయం 10 గంటలకు తన కరిగేట అంచులు తీస్తుండగా ఒడ్డు రంధ్రంలో ఉన్న కట్లపాము ఎడమ కాలు పై కాటు వేసింది

    (N.Naveen Kumar, News 18, NagarKurnool)

    పాము కాటుతో మరో రైతు మృతి చెందాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కొత్తగాండ్ల తండాకు చెందిన రైతు టోపియా నాయక్ (51) గురువారం ఉదయం 10 గంటలకు తన కరిగేట అంచులు తీస్తుండగా ఒడ్డు రంధ్రంలో ఉన్న కట్లపాము ఎడమ కాలు పై కాటు వేసింది. అయితే పామును గమనించని టోపీయా నాయక్ ముళ్ళు గుచ్చుకుందని తన పని తాను చేసుకున్నాడు. ఇంతలో రంద్రం నుంచి పాము బయటికి రావడం గమనించిన రైతు.. ఆ పామును చంపాడు. క్షణాల వ్యవధిలోనే రైతు సైతం స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, గత కొన్ని రోజులుగా నాగర్‌కర్నూల్ పరిధిలో పాము కాటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పంట పొలాల్లో దట్టంగా పచ్చదనం పేరుకుపోవడంతో పాములు బయట సంచరిస్తున్నాయి. దీంతో పొలాలకు వెళ్లాలంటే రైతులు భయంతో వొణికిపోతున్నారు.

    జోగులాంబ గద్వాల జిల్లా కేడిదొడ్డి మండలం ఇరికిచేడు గ్రామంలో వివాహిత అదృశ్యమైంది. ఎస్సై కుర్మయ్య తెలిపిన వివరాల ప్రకారం గువ్వలదిన గ్రామానికి చెందిన ప్రణీత ఇరికిచేడు గ్రామానికి చెందిన వినోదులు నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం ఉదయం ప్రణీత కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా కొద్దిసేపటి తర్వాత వినోద్ ప్రణీతను ఇంటి వద్ద వదిలిపెట్టి పొలం దగ్గరకు వెళ్ళాడు. సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరిగివచ్చి చూడగా ప్రణీత కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరక్క పోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    నాగర్‌కర్నూల్‌కి చెందిన ఓ వివాహిత పుట్టింటికి వెళ్తుండగా, ప్రమాదవశాత్తు మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిర్సానగండ్లకు చెందిన పసుల రేణుక (26) నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లిలోని తన పుట్టింటికి బయలుదేరింది. ఈ క్రమంలో పడమటిపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగింది రేణుక. బైక్ పై పడమటిపల్లి వైపు వస్తుండగా ఇదంపల్లి వద్దకు రాగానే రేణుక చీర ద్విచక్ర వాహనంలో చిక్కుకుని కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈమేరకు శుక్రవారం రేణుక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    తదుపరి వార్తలు