హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో డెంగ్యూ ముప్పు... ఏజెన్సీ ఏరియాలో విష జ్వరాలు విజృంభణ

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో డెంగ్యూ ముప్పు... ఏజెన్సీ ఏరియాలో విష జ్వరాలు విజృంభణ

నాగర్‌కర్నూల్ జిల్లాలో డెంగ్యూ ముప్పు

నాగర్‌కర్నూల్ జిల్లాలో డెంగ్యూ ముప్పు

గత వారం రోజుల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. అపరిశుభ్ర వాతావరణంతో  దోమల బెదడ అధికమై డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతున్నాయి

  (N.Naveen Kumar, News18, Nagarkurnool)

  వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఏజెన్సీ ఏరియాలో, మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కుగా ఉంటుంది. గత వారం రోజుల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక గ్రామాల్లో పారిశుధ్యం లొపించింది. అపరిశుభ్ర వాతావరణంతో దోమల బెదడ అధికమై డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 178 ఎపిడెమిక్ డిసీజ్ బృందాలను అప్రమత్తం చేసిన అధికారులు, అంటు వ్యాదులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా పరిధిలోని చెంచుపెంటలో ఆరు డెంగ్యూ కేసులను గుర్తించిన వైద్య సిబ్బంది ప్రత్యేకంగా నల్లమాల ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించారు.

  గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు, రవాణ సదుపాయం సరిగా లేకపోవడతో ప్రాణాంతక వ్యాధులు సోకిన.. వైద్యం చేయించుకునేందుకు ముందుకురాని పరిస్థితులు గతంలోనూ నెలకొన్నాయి. ఇటువంటి ఘటనలతో ఆ ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలి.. ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కరోనా, డెంగ్యూ, మలేరియా వంటి భయంకరమైన రోగాల భారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేపట్టింది. ఎపిడెమిక్ డిసీజ్ బృందాలను ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు చికిత్సలు అందిస్తున్నారు.

  జిల్లాలో 178 ఎపిడెమిక్ డిసీజ్ బృందాలు:

  సీజనల్ వ్యాదుల భారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ ఎపిడెమిక్ డిసీజ్ బృందాలను ఏర్పాటు చేసింది. అంటువ్యాధులు ప్రబలినప్పుడు వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వైద్యాధికారులు 178 ఎపిడెమిక్ డిసీజ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు తగిన వైద్య సహాయం చేస్తారు. వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ ఎపిడెమిక్ డిసీజ్ బృందంలో ఒక మలేరియా నివారణ టీం, హెల్త్ అసిస్టెంట్, కోఆర్డినేటర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉంటారు. వీరు ప్రతి గ్రామానికి ఒక నిర్దేశిత రోజును కేటాయించుకొని మండలాల వారీగా చికిత్సలు అందిస్తారు. వర్షాకాలం ఎక్కువగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో ఏజెన్సీ ఏరియాలో నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు. ఇంటింటికి తిరిగి అనారోగ్యానికి గురైన వారి రక్తం నమూనాలు సేకరించి వ్యాధులను గుర్తిస్తారు. కరోనా, డెంగ్యూ, మలేరియా, కలరా వంటి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు.

  గర్బిణీలు, చిన్నారులు, వృద్దులపై ప్రత్యేక దృష్టి:

  గ్రామాల్లో వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో గుర్తించిన రోగుల వివరాలను నమోదు చేసుకుంటారు. సీజన్ వారిగా వచ్చే వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధులుగా రూపాంతరం చెందితే ఆయా వివరాలను తక్షణమే ఉన్నతాధికారులకు చేరవేస్తారు. వర్షాకాలంలో ఏదైనా గ్రామంలో కలర, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను ప్రబలినప్పుడు రోగుల సంఖ్యను బట్టి జిల్లా ఆస్పత్రికి తరలించడం లేదా అక్కడే గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి చికిత్సలు చేపట్టడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ప్రబలిన రోగాలు పూర్తిగా తగ్గిపోయే వరకు సిబ్బంది అక్కడే ఉంటూ వైద్య సేవలు అందిస్తారు.

  చెంచుపెంటలకు పొంచి ఉన్న ముప్పు:

  నల్లమలా ఫారెస్ట్ ఏరియాలోని చెంచుపెంటలకు ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెంచుపెంట గ్రామంలో ఇప్పటి వరకు 6 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అచ్చంపేట డివిజన్లోని మున్ననూరు, అమ్రబాద్ ఏరియాలో డెంగ్యూ, మలేరియా వ్యాదులు ప్రబలుతున్నాయి. పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ ఉదయ్, వైద్యాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే వారంతపు హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెంచుపెంట గ్రామ ప్రజలకు 23 రకాల వైద్యపరీక్షలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ తగిన ఏర్పాట్లను చేపట్టారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించి వ్యాధులను నియంత్రించేందుకు సన్నద్ధమవుతున్నారు.

  గ్రామీణ స్థాయిలో వైద్య సేవులు అందిస్తున్నాం: సుధాకర్ లాల్, నాగర్‌కర్నూల్ డిఎంహెచ్ఓ, ఫోన్ 9440489057

  "సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాం. జిల్లాలో 178 ఎపిడెమిక్ డిసీజ్ టీంలను ఏర్పాటు చేశాము. నల్లమలా ఫారెస్ట్ ఏరియాలోని చెంచుపెంటలపై ప్రత్యేక దృష్టి సారించాము. ఇప్పటి వరకు జిల్లాలో 6 డెంగ్యూ కేసులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నాము" అని నాగర్ కర్నూల్ జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ న్యూస్ 18తో చెప్పుకొచ్చారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Dengue fever, Nagar kurnool, Rainfall, Telangana

  ఉత్తమ కథలు