(Syed Rafi, News18,Mahabubnagar)
రాష్ట్రంలోని గ్రామ పంచాయితీల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరుతో పాటు పనుల నిర్వాహణను పర్యవేక్షించి మండల పంచాయితీ అధికారులు ఎంపీఓ(MPO)లకు రవాణా సౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Government).ఇందుకు అవసరమైన నిధులను ఆయా స్థానిక గ్రామ పంచాయతీల నుంచి నిధులు సేకరించడానికి ఉత్తర్వులు(Orders) జారీ అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేసేలా సర్పంచు(Sarpanch)లకు అధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వచ్చాయి. అయితే దీనిపై మాత్రం ససేమిరా అంటున్నారు. గ్రామపంచాయితీల్లో ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని దానికి తోడు కొత్తగా ఈ కోతలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఎంపీవోల పర్యవేక్షణకు పంచాయితీ నిధులా..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 71 మండలాలు పరిధిలో మొత్తం 1.692 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే 71 మంది ఎంపీఓలు పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పనులు, డంపింగ్‌యార్డ్‌లు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు వంటి పనుల్ని పర్యవేక్షించడం ఈ అధికారుల విధులు. వీటన్నింటిని పరిశీలించడానికి వాహన రవాణా ఖర్చుల కింద నెలకు 20వేల రూపాయలు చెల్లించాలి. ఈ అధికారులు మండల పరిధిలోని గ్రామపంచాయితీల్లో జరిగే పనులపై వారానికోసారి జిల్లా స్థాయిలో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
జిల్లాలో ఎంపీఓలు, గ్రామపంచాయితీలు..
ఉమ్మడి పాలమూరు జిల్లా వారిగా చూసుకుంటే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీవోలు 14, గ్రామపంచాయితీలు 441 ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఎంపీవోల సంఖ్య 20 ఉండగా గ్రామపంచాయితీలు 461గా ఉంది. వనపర్తి జిల్లాలో 14 ఎంపీఓలు....255గ్రామపంచాయితీలున్నాయి. జోగులంబ గద్వాల్ జిల్లాలో 12 ఎంపీవోలు 255పంచాయితీలు కలవు. నారాయణపేట జిల్లాలో 11ఎంపీఓలు 280 గ్రామ పంచాయితీలున్నాయి. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 71ఎంపీవోలు, 1,692.గ్రామపంచాయతీలు ఉన్నాయి.
పంచాయతీ నిధుల్లోంచే ఇవ్వాలి..
గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణలో ఎంపీఓల పాత్ర ప్రధానంగా ఉంటుందంటున్నారు మహబూబ్‌నగర్ ఎంపీవో. పంచాయతీలు రొటేషన్ విధానంలో ఎంపీవో వాహనం ఖర్చులు చెల్లించాలి.. నిధులు వచ్చిన తర్వాత తిరిగి గ్రామపంచాయితీలకే చెల్లిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయితీల సర్పంచులు అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నారు.
ఎంపీవోలు బెదిరిస్తున్నారనే విమర్శలు..
ఎంపీవోల వెర్షన్ ఆ విధంగా ఉంటే సర్పంచ్‌లు మాత్రం ఎంపీవోల వాహన ఖర్చులు 20వేలు గ్రామపంచాయితీ నిధుల నుంచి తీసివ్వడం కుదరదు అంటున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఖర్చులను గ్రామ పంచాయతీలపై ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిధులు వచ్చిన తర్వాత తిరిగి ఇస్తామనే మాటలు నమ్మలేమంటున్న సర్పంచ్‌లు ఎంపీవోల వాహన ఖర్చులను జిల్లా కలెక్టర్ నిధుల నుంచి వినియోగించుకోవచ్చు కదా అని కొందరు సర్పంచ్‌లు సూచనలిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందనే సాకుతో కొందరు అధికారులు సర్పంచ్‌లను బెదిరించి మరీ డబ్బులు తీసుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని వెంటనే ప్రభుత్వ తమ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Telangana