(నవీన్, న్యూస్ 18 తెలుగు, నాగర్ కర్నూల్)
విదేశీ కరెన్సీని ఎర చూపి.. ఏకంగా 5 లక్షల రూపాయలు అపహరించిన సంఘటన కేసులో.. జడ్చర్ల పోలీసులు ఎనిమిది మంది నిందితులను గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల ఐదున బాదేపల్లి పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఎనిమిది మంది సభ్యులు సినీ పక్కిలో బాధితుల నుంచి 5 లక్షల తీసుకొని...వారికి ఇవ్వాల్సిన విదేశీ కరెన్సీకి బదులు...నకిలీ కరెన్సీతో పాటుగా మధ్యలో సబ్బు బిళ్లలు పెట్టి ఇచ్చారు. బాధితులు బ్యాగును ఇంటికి తీసుకెళ్లి చూడగా ... అసలు విషయం బయటపడింది.
మహబూబ్ నగర్‌కు చెందిన సిరాజుద్దీన్‌కు పట్టణంలోని వీరన్నపేటలో కంటి అద్దాల షాపు ఉంది. బంగ్లాదేశ్‌కు చెంది రోహింగ్యాలు కంటి అద్దాల చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినట్లు వెళ్లి.. వారితో మాట కలిపారు. తమ వద్ద దుబాయ్‌కు చెందిన కరెన్సీ ధీరమ్స్ ఉన్నాయని ...ఇవి చెల్లించినా మీకు ఓకేనా? అని అడిగారు. ఐతే ఆ షాప్ నిర్వాహకులు గతంలో దుబాయ్‌లో ఉండి వచ్చిన వారు కావడంతో.. ధీరమ్స్ కూడా ఓకే అని చెప్పారు. నిందితులు తమ వద్ద పదివేల నోట్లు దుబాయ్ కరెన్సీ ఉన్నాయని.. దీని విలువ ఇండియన్ కరెన్సీలో రూ.22 లక్షల వరకు ఉంటుందని.. తమకు 10 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఈ డీల్‌లో తమకు 12 లక్షల వరకు మిగులుతుండడంతో.. ఆప్టికల్ షాప్ నిర్వాహకులు ఓకే చెప్పారు.
అనంతరం.. జడ్చర్ల రైల్వే స్టేషన్లో ఇద్దరు కలుసుకొని అరబ్ కరెన్సీ పరిశీలించి నమ్మకం కుదిరింది. తర్వాత అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని నిందితుడు ఫోన్ చేసి చెప్పగా.. తన దగ్గర ఉన్న 5 లక్షల మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మిగతా డబ్బు తర్వాత ఇస్తామని చెప్పగా.. సరే అని ఒప్పుకున్నారు. ఆతర్వాత ఈనెల ఐదున బాదేపల్లి పోస్ట్ ఆఫీస్ దగ్గర రావాలని చెప్పారు.
సిరాజుద్దీన్ 5 లక్షల నగదును తీసుకొని బాధేపల్లి పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్, తన భార్య ఫరియా కలిసి తమ దగ్గర ధీరమ్స్ ఉన్న బ్యాగును ఇచ్చి.. ఐదు లక్షల బ్యాగు తీసుకొని ఎవరిది దారిన వారు వెళ్లారు. సిరాజుద్దీన్ మహబూబ్ నగర్‌లోని తన ఇంటికి వెళ్లి బ్యాగులో ఉన్న ధీరమ్స్ కరెన్సీ కట్టలను పరిశీలించగా కింద మీద మాత్రమే ధీరమ్స్ కరెన్సీ ఉన్నాయి. మధ్యలో సబ్బు బిళ్లలను, తెల్ల కాగితాలు మాత్రమే ఉన్నాయి. తాము మోసపోయామని గ్రహించి బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. ఈ క్రమంలో శనివారం జడ్చర్ల కొత్త బస్టాండ్ లో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న మహమ్మద్ రషీద్ ఖాన్, మహమ్మద్ సోహైల్, రహీం ఖాన్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా 21 ధీరమ్స్ కరెన్సీ పట్టుబడింది.
జడ్చర్లలో ఐదు లక్షలను అపహరించింది తామేనని నిందితులు నేరం అంగీకరించారు. అంతకుముందు నారాయణపేటలో కూడా ఇదే తరహాలో 9 లక్షలు అపహరించమని నిందితులు అంగీకరించారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలుగా పోలీసులు గుర్తించారు. వీరు ఢిల్లీ హర్యానా తదితర ప్రాంతాల్లో నివాసం అంటూ... వివిధ ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్‌లోని హన్వాడలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ మోసాలకు పాల్పడినట్లుగా సీఐ తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని భార్య అస్మ, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. అయితే విదేశీ కరెన్సీ నిబంధనలను ఉల్లంఘించి బాధితులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mahbubnagar, Telangana, Telangana News