హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ జిల్లాలో దొంగ-పోలీస్ సవాల్.. ఆరునెలల్లో 134 కేసులు.. బెంబేలెత్తిపోతున్న జనం..

ఆ జిల్లాలో దొంగ-పోలీస్ సవాల్.. ఆరునెలల్లో 134 కేసులు.. బెంబేలెత్తిపోతున్న జనం..

నాగర్ కర్నూల్ లో పెరిగిపోతున్న దొంగతనాలు

నాగర్ కర్నూల్ లో పెరిగిపోతున్న దొంగతనాలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇల్లు విడిచి వెళ్లాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool | Andhra Pradesh

  Naveen Kumar, News18, Nagarkurnool


  నాగర్‌ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇల్లు విడిచి వెళ్లాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఆలయాలు, ఇల్లు, వ్యాపార దుకాణాలు ఇలా ఎక్కడంటే అక్కడ, ఏది దొరికితే అది దోచుకెళ్తున్నారు. ఆగష్టు 25న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో ఒకేసారి మూడు ఎరువుల దుకాణాల్లో చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఒక్క నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో 134 చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయంటే దొంగల ఆగడాలు ఎంత మితిమీరుతున్నాయో అర్ధం అవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, నేర పరిశోధనలతో ముందడుగు వేయడమే కాక, అసలు నేరాలే జరగకుండా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నట్లైంది.


  గతంలో సమగ్ర సర్వే పేరుతో పాత నేరస్తుల జీవన విధానం, స్థితిగతులు, వారి వివరాలు, వారికి సహకరించిన వారితో పాటు వేలిముద్రలను ఐరిష్‌లను, ఫోటోలను పోలీసులు రికార్డు చేశారు. ఎక్కడ సంఘటన జరిగిన నేరస్తులను ఎవరన్నది, ఏ ప్రాంతంలో వారు ఉన్నది క్షణాల్లో గుర్తించే విధంగా సాంకేతికత పోలీసుల వద్ద ఉన్నదీ. నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.


  ఇది చదవండి: వర్క్ ఫ్రం హోం తెచ్చిన తంటా.. భార్య, అత్తింటి వేధింపులకు భర్త సూసైడ్..


  ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోనే ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 22 పోలీస్ స్టేషన్లలో 134 చోరీ కేసులు నమోదయ్యాయి. ఈకేసుల్లో రూ. 77,74, 240 వరకు నగదు చోరీకి గురైంది. ఇందులో 45 కేసులకు సంబంధించిన రూ.40.42 లక్షల సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఇందులో అత్యధికంగా అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అమ్రాబాద్, వంగూరు, చారగొండ మండలాల పరిధిలో ఉన్నాయి. అదే సమయంలో ఈగలపెంట, పదర, తాడూరు పరిధిలో ఒక్క చోరి కేసు కూడా నమోదు కాలేదు.


  ఇది చదవండి: క్యాన్సర్ బాధితులను వెతుక్కుంటూ వెళ్తారు.. సాయానికి బదులు సంతకాలు తీసుకుంటారు.. వాటితో చేస్తారంటే..!


  ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న చోరీల వివరాల ప్రకారం.. జూలై 15న జిల్లా కేంద్రంలోని ప్రధాన రవాణా రహదారిపై ఉన్న దుకాణంలో వెనుక గోడకు రంధ్రం చేసి తులం బంగారం, 15 కిలోల వెండితో పాటు నగదు చోరీకి గురైంది. జూలై 31న నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనులులో ఫర్టిలైజర్ దుకాణంలో  రూ.85,000 నగదు దోచుకున్నారు. ఆగస్టు 2న వెల్దండ మండలంలోని బర్కత్ పల్లి ఆలయంలో దొంగలుపడి తులం బంగారం, వెండి, ఇతర ఆభరణాలు దోచుకున్నారు.


  ఇది చదవండి: వాట్సప్‌లో వలపు వల.. అమ్మాయిల ఫొటోలతో గాలం.. ఏపీలో స్మార్ట్‌ గా హైటెక్‌ వ్యభిచారం


  ఆగస్టు 5న వెలదండ మండలంలోని అంబా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మూడు హుండీలను ఎత్తుకెళ్లారు. ఆగస్టు 8న తెలకపల్లి మండల కేంద్రంలో ఫోటో షాప్‌తో పాటు మెడికల్ దుకాణంలో రూ. 65 వేల నగదు చోరీ చేశారు. ఆగస్టు 15న కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి రూ.5 లక్షల నగదు, 12 తులాల బంగారం చోరీ చేశారు. తాజాగా కొల్లాపూర్ చౌరస్తాలో మూడు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ మూడు షాపుల్లో కలిపి మొత్తం రెండు తులాల బంగారం, రూ. 85 వేల నగదు చోరీ చేశారు.  జిల్లాలో చోరీ ఘటనలు పెరిగిపోతుండడంపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇండ్లకు తాళాలు వేసి వీధి చివరకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వరస దొంగతనాలు జరుగుతున్నా దుండగులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీ, సిసిటీవీలు అందుబాటులో ఉన్నా దొంగతనాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజల్లో భావన ఏర్పడింది. అయితే పోలీసులు మాత్రం తమ వంతు ప్రయత్నంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు