రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు అవినీతి జలగలకు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల మార్పులను తీసుకొని వచ్చింది. గతంలో వీఆర్వోలపైన వచ్చినటువంటి ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని వీఆర్వో వ్యవస్థని రద్దు చేసింది. ఎక్కడ కూడా పైరవీలకు కానీ లంచాలకు కానీ తావివ్వకుండా ఉండాలని ధరణిని చేపట్టింది. భూప్రక్షాళన చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నా కానీ రెవెన్యూ ఉద్యోగుల్లో ఇంకా అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతూనే ఉన్నారు.
వారి అవినీతి దాహం ఎంతైనా తీరడం లేదు. అమాయక ప్రజలను లంచాల పేరుతో డబ్బులు వసూలు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి అవినీతి చేపని నాగర్కర్నూల్ జిల్లాలో ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. రైతు దగ్గర నుంచి రూ.10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం భూమిని విరాసత్ చేసేందుకు రూ.10,000 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసిబీ వివలలో చిక్కిన సంఘటనచోటుచేసుకుంది. కోడేరు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ కథనం మేరకు కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన చికిరాల వెంకయ్య గతంలో మృతి చెందాడు. అతని పేరు మీద కోడేరు మండలంలోని రేకులపల్లి గ్రామ శివారులో ఒకటి పాయింట్ (1.2) ఎకరాల భూమి ఉంది.
ఆ భూమి తన పేరు మీద విరాసత్ చేయాలని వెంకయ్య కుమారుడు చీకిరాల సాయిబాబా గతేడాది జులై 16న మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు విరసత్ చేయలేదు. దీంతో విసుగు చెంది కలెక్టరేట్ లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని అధికారులు సమస్య పరిష్కరించాలని కోడేరు తాసిల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆదేశించారు.
అయినా డీటీ పురుషోత్తం కాలయాపన చేస్తూ వచ్చారు. పని చేయాలంటే రూ. 15,000 లంచం ఇవ్వాలని 20 రోజుల కిందట చీకిరాల సాయిబాబుకు డీటీ చెప్పారు. చివరకు రూ.10,000 ఇస్తానని ఒప్పుకున్నాడు.కాగా నాలుగు రోజుల కిందట సాయిబాబు అతని అన్న కుమారుడు చికిరాల నాగేంద్రతో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ తాసిల్దారు పురుషోత్తం నాగేంద్రం రూ.10,000 రూపాయల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను రికవరీ చేసి విచారణ చేస్తున్నారు.
నాంపల్లి కోర్టులో డీటీని హాజరు పరిచినట్లు ఏసిబి డిఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా 9491305609 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ దాడిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్స్పెక్టర్ లింగస్వామి నల్గొండ జిల్లా ఇన్స్పెక్టర్ వెంకటరావు సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana