మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. తొమ్మిదవ తరగతి విద్యార్థులతో పదవ తరగతి విద్యార్థి నృత్యాలు చేయించడంతోపాటు జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థి దాడికి పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వసతి గృహంలోని విద్యార్థులపై అజమాయిషి చేయాల్సిన వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోని హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ సంఘటనలపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వసతి గృహం ముందు ఆందోళన దిగారు.
అచ్చంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి జడ్చర్లలోని ఎస్సీ వసతి గృహంలో ఉంటూ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి బాదేపల్లిలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి వసతి గృహంలో వార్డెన్ తర్వాత తానే వార్డెన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని, తమపై అకారణంగా చేయించుకుంటున్నాడని వసతి గృహంలోని విద్యార్థులు వాపోయారు.
ఇటీవల తనకు మూడు బాగోలేదంటూ జూనియర్ విద్యార్థులతో డాన్స్ చేయించాడని వాపోయాడు. మూడు రోజుల క్రితం వసతి గృహంలో ఉన్న తలుపులు విరిగిపోయిన విషయంలో రాత్రి 11 గంటల సమయంలో నిద్రిస్తున్న 9వ తరగతి విద్యార్థులను కొట్టుకుంటూ నిద్రలేపి తలుపులు ఎందుకు విరగొట్టారని దాడికి పాల్పడిన విద్యార్థులు ఆరోపించారు.
ఈ సంఘటనలో 9వ తరగతి విద్యార్థిని కట్టెలతో కొట్టడంతో కాలుకు వాతలు రావడం, మెడపై చేయి గోర్లతో రక్కడంతో గాయాలయ్యాయి. జరిగిన సంఘటనను జడ్చర్లలో నివాసం ఉంటున్న తన అత్తకు బాధితుడు ఆదివారం రాత్రి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే హాస్టల్ కు వచ్చిన ఆమె జరిగిన సంఘటన వివరాలను విద్యార్థి తల్లిదండ్రులకు చేరవేశారు. బాధితతల్లిదండ్రులు వసతి గృహం వద్దకు వచ్చారు. అనంతరం వసతి గృహంలో జరిగిన సంఘటనపై వార్డెన్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆరోపించారు.
ఇదే సందర్భంలో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వసతి గృహం ముందు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా కలెక్టర్ కు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి ఏఎస్ డబ్ల్యూ ఓ విజయలక్ష్మి చేరుకొని విచారణ చేపట్టారు. వార్డెన్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తామని ఏఎస్డబ్ల్యుఓ చెప్పారు. సాయంత్రం వసతిగృహం విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. జడ్చర్ల సిఐ రమేష్ బాబు, ఎస్సై లెనిన్ కూడా హాస్టల్ కు వచ్చి ఆరా తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana