Naveen Kumar, News18, Nagarkurnool
సాధారణంగా ఇష్టదైవం అనుగ్రహం కోసం దీక్ష చేపడతారు. ఇష్ట దైవం తలుచుకుంటూ 41 రోజులపాటు దీక్ష పూని స్వాములు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయ్యప్ప మాలలు, హనుమంతుడి దీక్షలు, శివదీక్షలు, భవాని దీక్షలు ఇలా తమ తమ ఇష్ట దైవాలకు సంబంధించిన దీక్షలు పూని సన్మార్గంలో నడుస్తూ ఉంటారు. అయితే మరో కొత్త తరహా దీక్ష నాగర్ కర్నూలు జిల్లా (Nagar Kurnool District) లో కొంతమంది ఆచరిస్తున్నారు. అదే జై భీమ్ దీక్ష. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకు 30 రోజులపాటు ఈ దీక్షను చేపట్టారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు వరకు ఈ దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలు చేపట్టిన వారంతా నీలి రంగులు చొక్కాలు ధరించి 30 రోజులపాటు మాంసం, మద్యం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు.
ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తారు. అబద్ధాలు ఆడకుండా ఇతరులను మోసం చేయకుండా నిజాయితీగా గడుపుతారు. ప్రతిరోజు కూడా తమకునచ్చిన గ్రామానికి వెళ్లి అక్కడ అక్కడ పేదరికంలో ఉన్నవారికి తోచినంత సహాయం చేయడం, అంబేద్కర్ వారి కోసం అందించిన హక్కులను తెలియజేయడం మహనీయుల ఆశయాలను తెలియజేయడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఎటువంటి మోసాలకు పాల్పడకుండా అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా సన్మార్గంలో నడుస్తూ ఉంటారు.
ఈ జై భీమ్ దీక్షలను నాగర్కర్నూల్ జిల్లాలో 40 మంది చేపట్టారు. వీరు గత 8 సంవత్సరాలుగా ఈ దీక్షలు చేస్తూ ఉన్నారు. మహనీయుల ఆశయ సాధనల కోసం వారు చూపించిన సన్మార్గంలో నడిచేందుకు తమను, తమ జాతిని, తమ కుటుంబాలను అభివృద్ధిపరిచేందుకు ఈ దీక్షలు చేపడుతున్నామని జై భీమ్ దీక్ష అధ్యక్షులు బంగారయ్య చెప్పారు.
ఈ దీక్ష చేపట్టడం వల్ల తమలో చాలామందికి ప్రవర్తనలో మార్పులు కలిగాయని, చెడు వ్యసనాలకు దూరమయ్యామని, సన్మార్గంలో నడుస్తున్నామని వివరించారు. సమాజ శ్రేయస్సు కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తాము చేపట్టిన దీక్ష తమకి ఎంతో సంతృప్తి అందిస్తుందని వివరించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమావేశమై మహనీయుల చరిత్రలను తెలుసుకునేలా తాము దీక్ష కాలాన్ని వినియోగించుకుంటామని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana