రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
ప్రధాన రాజకీయ పక్షాలు పాలమూరు పైనే ఫోకస్ చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నాయి. అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్, మోడీ పాలనలో భారత్ వెలుగుతున్నది.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణలో ఎనలేని అభివృద్ధి సాధించారని బీజేపీ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర జోష్తో కాంగ్రెస్ పూర్వవైభవాన్ని చాటేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర బిందువుగా చేసుకొని క్రియాశీల రాజకీయాలకు ఆయా పార్టీలు శ్రీకారం చుట్టడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ గెలుపు లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను అమలు చేస్తుంది. ఆయా నియోజకవర్గాలలో నేతలు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను పరిశీలిస్తూ, పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు.
సీఎం కేసీఆర్ ఏడాది మొదటి వారంలో మహబూబ్నగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాగా ఇటీవల రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నారాయణపేటలో పర్యటించారు. వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.. ప్రారంభోత్సవాలు చేశారు. మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలో నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే మున్సిపాలిటీలో వార్డుల వారీగా పర్యటించేందుకు సమాయత్తమవుతున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రధానంగా పాలమూరుపైనే దృష్టి సారించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాఅలంపూర్ లోని జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు. ఈయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కొనసాగింది.
దీని ద్వారా ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే మహబూబ్నగర్లో పర్యటించారు. తాజాగా ఇటీవల బీజేపీ కార్యవర్గ సమావేశాలకు మహబూబ్నగర్ వేదికగా నిలవడం జిల్లాపై ఆ పార్టీ ఫోకస్ స్పష్టమవుతోంది. అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతూనే రాజకీయ కార్యచరణలతో పాటు కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
బీజేపీలో ప్రధాన నాయకులలో ప్రధాని మోడీ, అమిత్ షాలలో ఒకరు పాలమూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం రూపొందుకుంది. దీంతో పాలమూరు జిల్లాలో బీజేపీ నాయకుల సందడి మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా పాలమూరు జిల్లాపై ఫోకస్ పెంచి చాప కింద నీరులా పలు నియోజకవర్గాలలో పర్యటన చేపట్టింది.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి దగ్గర చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనం రావడంతో నేతల్లో ఉత్సాహం నేలకొంది. అదేవిధంగా రాహుల్ గాంధీ జోడోయాత్ర జిల్లాలో విజయవంతం కావడంతో ఆ హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో మరో యాత్రకు స్వీకారం చుట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభం ఉండడంతో మార్చి 26 వరకు అంటే 60 రోజుల పాటు కొనసాగనుంది. జిల్లా కేంద్రాలతో పాటు మండలాల్లో ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేసి మధ్యాహ్నం రెండు గంటలకు హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభం చేపట్టారు.
పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత మండల పరిధిలోని స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యం వివరిస్తూ కరపత్రాలు పంచుతున్నారు. ఇలా ఉమ్మడి పాలమూరు కేంద్రంగా ప్రధాన పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. దీంతో ముందస్తు ఎన్నికలు కాయమని ప్రచారం జోరుగా కొనసాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana