Naveen Kumar, News18, Nagarkurnool
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (MLA Guvvala Balaraju) పై ఆ నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల సంఘాల నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఫామ్ హౌస్ కేసు విషయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రూ.100 కోట్లకు అమ్ముడుపోయాడని పోస్టర్లు నియోజకవర్గంలో వెలిశాయి. ఈ పోస్టర్లు నేడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పై నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం రేపాయి. ఈ పోస్టర్లు జిల్లాలో మండలంలో చర్చనీయాంశంగా మారింది.
అమ్రాబాద్ మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు అచ్చంపేట ఆత్మగౌరవం 100 కోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజని, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఎమ్మెల్యేను అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరుముదామని, ఓట్లేసి గెలిపించిన ప్రజలారా మేధావుల్లారా యువకుల్లారా విద్యావంతుల్లారా ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాలని పోస్టర్లు పొందుపరిచారు. అలాగే వివిధ సందర్భాలలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ పోస్టల్ లో ముద్రించి మండల కేంద్రంలో అతికించారు.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై గుర్తు తెలియని వ్యక్తులు అమ్రాబాద్ మండల కేంద్రంలో పోస్టల్ వేసిన తీర్పు నిరసనగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రశాంతంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం కావడంతో శాంతి పద్ధతులు విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీల రొంపిలో కొందరు అమాయకులను రంగంలోకి దింపి వారి జీవితాలతో చెలగాటం ఆడుకునే రాజకీయ నాయకులకు తగునా అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ వేడి వాతావరణంలో ఒకరిపై ఒకరు విమర్శలు ఆందోళన కార్యక్రమాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న అమ్రాబాద్ మండలాన్ని వివాదాల్లోకి నెట్టేసి, పైశాచిక ఆనందం పొందడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదని, కొందరు అమాయకులు బలి అవుతారని ఇలాంటి రాజకీయాలు సహేతుకం కాదని మండల ప్రజలు అభిప్రాయం పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana