Naveen Kumar, News18, Nagarkurnool
గ్రామాల్లో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు జరగకుండా ఏడాదికోసారి నిర్వహించే గంప జాతర ప్రతి యేటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఒక ప్రత్యేక పండుగను నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావలసిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెట్టి ప్రజలు గంప నెత్తిన పెట్టుకొని ఊరి చివర పంట పొలాల వద్దకు చెట్ల కిందకు వెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. సంవత్సరానికి ఓసారి ఇలా చేస్తే అంటు రోగాలు రావని, పట్టిన దరిద్రాలు వదులుతాయని ప్రజల్లో గట్టి నమ్మకం. మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar District) వాసుల్లో ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ గంప జాతరలు ప్రారంభమయ్యాయి.
ప్రతి గ్రామంలో ఆదివారం, మంగళవారాలు ఈ తరహా వేడుకలు కొనసాగుతున్నాయి. పాలమూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో ఈ గంప జాతర నిర్వహిస్తారు. గ్రామంలో అందరూ కలిసి మాట్లాడుకుని ఒక తేదీని నిర్ణయించుకొని ఆ రోజు మూకుమ్మడిగా ఊరు వదిలి పెట్టేందుకు గ్రామస్తులు, పెద్దలు సమక్షంలో తీర్మానం చేస్తారు. ఆ రోజు గ్రామంలో ఎవరూ ఉండకూడదు. ఇళ్లకు తాళాలు వేసి పంట పొలాల్లోని చెట్ల నీడలు ఉన్న ప్రాంతాలకు వెళ్తారు. గ్రామంలో ఎవరికైనా చిన్నపిల్లలకు అమ్మ తల్లి లాంటివి వస్తే గంప జాతర నిర్వహణ చేపట్టరు. అప్పటికి వాయిదా వేస్తారు. ఈ సంవత్సరం సైతం గత ఫిబ్రవరి నెల నుంచి ఆది, మంగళవారాల్లో ఆయా గ్రామాల్లో ప్రజలు గంప జాతర నిర్వహిస్తున్నారు. కుటుంబ సమేతంగా గ్రామానికి దూరంగా పంట పొలాలలో వారికి అనుకూలమైన చోట చెట్ల కిందకు వెళ్లి గడుపుతారు.
తెచ్చుకున్న వంట పాత్రల్లో వండుకొని.. అక్కడే ఆరగించి పొద్దస్తమానం సంతోషంగా ఉంటారు. సాయంత్రం కాగానే వంట పాత్రలు, తెచ్చుకున్న ప్లేట్లు ఇతరత్రా వాటిని శుభ్రం చేసుకొని ఇళ్లకు చేరుకుంటారు. గంప జాతర పేరుతో ఊరు వదిలే ఆచారం ప్రతి సంవత్సరం జిల్లాల్లోని చాలా గ్రామాల్లో కొనసాగుతూ వస్తుంది. గంప జాతర కార్యక్రమాన్ని తాజాగా మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లో గ్రామాల్లోని జరుపుకుంటున్నారు. గంప జాతర పేరుతో గ్రామాన్ని వదిలి చెట్ల కింద గడిపి పొద్దు పోయాక ఇళ్లకు చేరుకుంటే అంటురోగాలు రావని దరిద్రం వదులుతుందని ప్రజల నమ్మకం. నిర్ణయించిన ప్రకారం ఆరోజు గ్రామంలో ఎవరు ఉండకూడదు.. అన్ని ఇల్లు తాళాలు వేసి వెళ్తారు. ఆరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని చెబుతారు.
గతంలో వర్షాలు కురవాలని కోరుతూమూడు నాలుగు దశాబ్దాల కిందట వరకు గంప జాతరను జరుపుకునే వారని పెద్దలు చెబుతున్నారు. తెల్లరక ముందే లేచి గ్రామాన్ని వదిలి అడవిలోకి వెళ్లి ప్రకృతి ఒడిలో సేద తీరడానికి వెళ్లేవారు. ఈ సమయంలో కష్టాలు తొలిగిపోవాలని ప్రకృతిని తలుచుకొని ఏడవటం, బాధపడటం వంటివి చేసేవారని.. తినడానికి చింతపండు, ఉప్పు, కారం వంటివి తీసుకెళ్లేవారని చెబుతారు. రోజంతా అడవిలో వర్షాలు కురవాలని ప్రకృతిని పూజించేవారని చెప్పుకొచ్చారు. మూడు నాలుగు దశాబ్దాల కిందట గంప జాతర నిర్వహణ, ఆచారాలు, ప్రస్తుత అభివృద్ధి క్రమంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం.. ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం చాలామంది విందు వినోదాలతో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ గ్రామంలోని పెద్దలు చెప్పుకొచ్చారు. జడ్చర్ల మండలం గంగాపురంలో గంప జాతర మరో విధంగా నిర్వహిస్తారు. తమ పొలంలో పండించిన కొత్త ధాన్యాన్ని ప్రత్యేకంగా అలంకరించి గంపలో పెట్టి వాటిని గంగాపూర్ లోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి సమర్పించేందుకు తరలివస్తారు. కొడంగల్, నారాయణపేట, కోయిలకొండ,ధన్వా డ, నవాబుపేట ప్రాంతాల నుంచి గంపలపై, బండ్లపై గంగాపురానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana