N.Naveen Kumar,News18,Nagarkurnool
గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ..మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలు చేసే వాళ్ళ మాయలో పడొద్దని జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రచారాలు నిర్వహించినా..అధికారులు ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు మూఢనమ్మకాల వైపే వెళుతూ ఉన్నారు. క్షుద్ర పూజలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామాల నడిబొడ్డున, నాలుగు కూడళ్ళు కలిసే ప్రాంతాల్లో, పాఠశాలల ఆవరణలో క్షుద్ర పూజలు చేస్తూ అందరిని ఆందోళన గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకుంది.
మండల కేంద్రంలోని ఊరి చివరన ఉన్న ఆదర్శ పాఠశాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు కొందరు క్షుద్ర పూజలు చేయడం వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రధాన గేటు వెనకాల ఉన్న బాలికల వసతి గృహం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. సున్నంతో చుట్టూ గీసి అందులో కొబ్బరికాయ, ఇనుపమేకు, జిల్లేడు ఆకులు, జీడిగింజలు, నిమ్మకాయలు పెట్టి పూజలు చేశారు. ఉదయాన్నే ఆదర్శ పాఠశాల వసతి గృహంలో బాలికల వంటకాలు చేసే మహిళ అటుగా వెళ్లి చూడగా పూజలు చేసి వదిలిన వస్తువులు కనిపించాయి. వసతి గృహంలో బాలికలు చూసి భయాందోళన చెందుతున్నారు.
విషయం తెలుసుకున్న వసతిగృహం ఇంఛార్జి నాగమణి అక్కడికి వచ్చి ఎలా జరిగిందంటూ ఆరా తీశారు. జరిగిన సంఘటన మౌఖికంగా తెలపడంతో అక్కడి పోలీసులు వచ్చి వాటిని తొలగించారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని మనోధైర్యం ఇచ్చారు. పిల్లలను భయపెట్టేందుకే కొందరు ఆకతాయిలు చేసి ఉండవచ్చని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై పోలీసులు పాఠశాలలో ఉన్న సీసీ కెమెరాలు ఒకటి బయట మార్చాలని సూచించారు. తాము నిఘా పెట్టి ఎవరు చేశారన్న విషయాన్ని గుర్తించే విధంగా చూస్తామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana