Naveen Kumar, News18, Nagarkurnool
పండుగ ఏదైనా భారతీయ సాంప్రదాయా వేడుకల్లో తప్పనిసరిగా మిఠాయిలు ఉండాల్సిందే. అందులోనూ దీపావళి పండుగ (Diwali Festival) వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది మిఠాయిలు. ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే దీపావళిలో టపాసులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్వీట్స్ (Sweets) కూడా అంతే ప్రత్యేక స్థానం ఉంటుంది. లక్ష్మి పూజ నిర్వహించి మిఠాయిలను నైవేద్యంగా పెట్టి అనంతరం బంధుమిత్రులకు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. నేతితో చేసిన రుచికరమైన మిఠాయిలను ఇష్టపడుతుంటారు. అయితే ఈ పండుగలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మిఠాయిలను కొందరు స్వయంగా ఇంట్లో తయారు చేసుకుంటుండగా మరికొందరు బయట మార్కెట్లో కొనుగోలు చేస్తారు.
ప్రతి ఏటా దీపావళి వచ్చిందంటే కొనుగోలుదారులతో మిఠాయి దుఖాణాలు కిటకిటలాడుతుంటాయి. సీజన్లో డిమాండ్‌ను బట్టి వ్యాపారులు కూడా రకరకాల స్వీట్స్ తయారు చేసి వినియోగదారులను ఆకట్టుకుంటారు. దసరా, దీపావళి మధ్య దేశ వ్యాప్తంగా వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే గత కొన్నేళ్లుగా వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కరోనా కారణంగా గత మూడేళ్లలో దుకాణాల్లో మిఠాయిలు కొనుగోలు చేసిన వారు లేరు. ఇక ఈ ఏడాదైనా వ్యాపారం పుంజుకుంటుందని భావించినా స్వీట్ల కొనుగోలు చాలా వరకు తగ్గిపోయాయని స్వీట్ షాప్ యజమానులు చెప్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాయంబి స్వీట్ హౌస్ న్యూస్18 సందర్శించగా ఈసారి పూర్తిగా నష్టాలు చవి చూస్తున్నామని స్వీట్ హౌస్ యజమాని మాయంబి వివరించారు. సూర్యగ్రహణం ఉండడం చేత ఆ సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదనే భావనతో పూజలను వాయిదా వేసుకుంటున్నారని, దీంతో స్వీట్ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పుకొచ్చారు. గత ఏడాది కరోనా సమయం ఉన్నప్పటికీ స్వీట్ అమ్మకాలు కొంతవరకు జరిగాయని కానీ ఈసారి సూర్యగ్రహణం ప్రభావం వలన పూర్తిగా అమ్మకాలు తగ్గిపోయాయని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.