(N. Naveen Kumar, News18, Nagarkurnool)
కోస్తాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు, కొల్లేరు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే చేపల చెరువులు క్రమక్రమంగా తెలంగాణ (Telangana) ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్నాయి. తెలంగాణలో భూగర్బ జలాలు అధికంగా పెరగడం, సాగునీరు పుష్కలంగా లభిస్తుండటంతో రైతులు సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఆక్వా సాగు (Aquaculture) మొదలు పెడుతున్నారు. వరి, వేరుశనగ, పత్తి వంటి పంటలను పక్కనబెట్టి చేపల చెరువులు సాగుచేస్తున్నారు. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో రైతులు చేపల (Fish) సాగుపై దృష్టి పెడుతున్నారు. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 15కు పైగా చేపల చెరువులు సాగు (Aqua cultivation) చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
కొర్రమీను సాగు చేస్తున్న రైతు వెంకటరెడ్డి..
నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కోడేరు మండలం, నాగులపల్లి గ్రామానికి చెందిన రైతు (farmer) వెంకటరెడ్డి మొట్టమొదటిసారిగా నాటు కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించారు. గతంలో వేరుశనగ, పత్తి, జామ, మామిడి తోటలను సాగు చేసిన ఆయన ఈసారి చేపల పెంపకం ఎంచుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా పెంపకం చేపట్టి, అధిక లాభాలు గడించాలని చేపల చెరువు వేసినట్టు రైతు వెంకటరెడ్డి వివరించారు. తనకున్న 10 ఎకరాల పొలం (Farm)లో మొదటిసారిగా 30 గుంటల్లో చేపల చెరువు (Pond) నిర్మాణం చేపట్టారు. 10 అడుగుల లోతుగా మట్టి తవ్వించి ఈ చెరువును ఏర్పాటు చేశారు. బోరు బావి సదుపాయం ఉండటంతో బోరు ద్వారా చేపల చెరువులోకి నీటిని పంప్ చేస్తున్నారు. చెరువు నిర్మాణం చేపట్టే సమయంలో చెరువులోకి పాములు, ఇతర క్రిమికీటకాలు చేరకుండా ఉండేందుకు చూట్టూ పటిష్టమైన కంచెను ఏర్పాటు చేశారు. నల్లరేగడి నేలలో ఈ చెరువు నిర్మాణం చేపట్టి చేపల పెంపకాన్ని ప్రారంభించారు.
10 వేల చేప పిల్లలతో మొదలుపెట్టిన పెంపకం..
ఇతర ఏ రకమైన చేపలు సాగు చేసినా ప్రారంభంలో నష్టాలు ఉంటాయి. అయితే కొర్రమీను సాగులో ఆ నష్టాలు కొంతమేర తగ్గించుకోవచ్చు. దీంతో 10 వేల నాటు కొర్రమీను రకం చేప పిల్లలను తీసుకొచ్చి సాగు ప్రారంభించారు రైతు వెంకటరెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలో "నాచ్యూరల్ హాచరీస్" నుంచి ఈ చేప పిల్లను కొనుగోలు చేసినట్లు వెంకటరెడ్డి వివరించారు. 3 అంగులాల పొడవుగల ఒక్కో చేప పిల్లను రూ.10కి కొనుగోలు చేసినట్లు రైతు పేర్కొన్నారు. అన్ని ఒకే సైజ్ నాటుకొరమీను చేపలను కొనుగోలు చేయడంతో ఒక చేపను మరో చేప తినలేదని, అందులోనూ మొదటి నుంచి చేపలకు ఫీడ్ అలవాటు చేయడంతో చేప పిల్లలు చనిపోవడం చాలా తక్కువగా ఉందన్నారు.
పెట్టుబడి, ఖర్చు ఎంత?..
నాటు కొర్రమీను కావడంతో ఆక్సిజన్ సమస్య లేదని, ఎలాంటి రోగాల బెడద లేదని చెప్పుకొచ్చారు వెంకటరెడ్డి . ఇప్పటి వరకు ఫీడ్ తప్పా మరే ఇతర రసాయనాలను వాడింది లేదని రైతు వెంకటరెడ్డి వివరించారు. ఈ చేపల చెరువు సాగులో కేవలం చేపల ఫీడ్‌కు మాత్రమే అధిక ఖర్చు అవుతుందని అన్నారు. రోజు మూడు పూటలా తప్పనిసరిగా ఫీడ్ అందిస్తున్నారు. ఒక కిలో ఫీడ్ మార్కెట్‌లో రూ.120కు అందుబాటులో ఉండగా రోజకు 60 కిలోల వరకు ఫీడ్ అవసరమవుతుందన్నారు. ఇప్పటి వరకు రూ.10లక్షల వరకు పెట్టుబడులు కాగా ఒక కిలో చేపకు రూ. 200 వరకు ఖర్చవుతుందని వివరించారు.
రైతు వద్ద అమ్మకానికి సిద్ధంగా కొర్రమీను..
రైతు వెంకటరెడ్డి సాగు చేసిన నాటు కొర్రమీను చేపలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. సాగు ప్రారంభించి 8 నెలల గడువు ముగియడంతో ఒక్కో చేప కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరిగింది. దాదాపు 10 వేల చేపలు ఉంటడంతో మొదటగా 2 వేల చేపలను మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. కొనుగోలుదారులు నేరుగా వచ్చినా మార్కెట్ రేటుకే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఆక్వా రైతు వెంకటరెడ్డిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8978573954.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, Fish, Local News, Nagarkurnool