NAGAR KURNOOL NAGARKURNOOL DISTRICT TRANSPORT OFFICER INSPECTS SCHOOL BUSES AND CHECKS FOR FITNESS CERTIFICATE SNR NNK BRV
Nagarkurnool: విద్యార్థుల తలిదండ్రులు ఇది గమనించరూ: పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
(స్కూల్ బస్‌ల ఫిట్నెస్..?)
Nagarkurnool: విద్యార్థులను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే స్కూల్ బస్సుల ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయనే విషయాన్నీ తల్లిదండ్రులు గమనించడం లేదు. బస్సులు ఏ విధంగా ఉన్నాయి, ఫిట్నెస్ ఉందా లేదా? రవాణాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా? అనే విషయాలను పట్టించుకోవడం లేదు.
స్కూల్ బస్సు ఫిట్నెస్ లేకపోతే సీజ్
జాగ్రత్తలు పాటించండి విద్యాసంస్థలకు హెచ్చరిక
నాగర్ కర్నూల్ జిల్లాలో 250 స్కూల్ బస్సులు
తల్లిదండ్రులు స్కూల్ బస్సులను గమనించాలి
---------------------------------------------------------------------------------
దేశ వ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలని వసతులు ఎలా ఉన్నాయి, సిబ్బంది ఎంతమంది ఉన్నారు, నైపుణ్యంగల విద్యాబోధన ఇస్తున్నారా లేరా అని తల్లిదండ్రులు ఆరా తీస్తుంటారు. వీటన్నింటి గురించి తెలుసుకుంటున్న తల్లిదండ్రులు అతి ముఖ్యమైన రవాణా సదుపాయం విషయంలో అవగాహన కోల్పోతున్నారు. విద్యార్థులను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే స్కూల్ బస్సుల ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయనే విషయాన్నీ తల్లిదండ్రులు గమనించడం లేదు. పాఠశాల బస్సు(School buses)ల కోసం ప్రత్యేక రవాణా చార్జీలు(Shipping charges)చెల్లిస్తున్న తల్లిదండ్రులు.. ఆ బస్సులు ఏ విధంగా ఉన్నాయి, ఫిట్నెస్(Fitness)ఉందా లేదా? రవాణాశాఖ మార్గదర్శకాల(Transportation guidelines)కు అనుగుణంగా ఉన్నాయా లేదా? అనే విషయాలను పట్టించుకోవడం లేదు. పిల్లలకు సంబంధించిన అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రులు, రవాణా విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.
విద్యార్థుల సౌకర్యం కోసం బస్సులు:
విద్యార్థులను తల్లిదండ్రులను ఆకర్షించడానికి ప్రైవేట్ పాఠశాలలు కల్పించే ప్రధానమైన అంశం బస్సు సౌకర్యం. విద్యార్థుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను సమకూరుస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థులు నిర్ణిత ఫీజులను చెల్లించి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చే బస్సులు పూర్తి కండిషన్లో ఉంచి నడిపించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలపై ఉంది. ప్రతి ఏడాది రవాణాశాఖ అధికారులు జారీచేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందిన బస్సులు మాత్రమే విద్యార్థుల రవాణా కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరిగితే రవాణా శాఖ అధికారులు వాటిని సీజ్ చేసి కేసులు పెడుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 250 ప్రైవేట్ స్కూల్ బస్సులు:
నాగర్‌కర్నూలు జిల్లాలో 250 వరకు ప్రైవేట్ స్కూల్ బస్సులు వున్నాయి. వీటిలో ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందిన బస్సులు కేవలం 80 మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే సమయానికి జిల్లా రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్ ఫిట్నెస్ పరిశీలించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ కోసం రవాణాశాఖ సూచనలు పాటించాల్సి ఉంటుంది యాజమాన్యాలు. ఏప్రిల్ నెలలో స్కూల్ బస్సులు ఫిట్నెస్ పొందేందుకు అధికారులు అవకాశం కల్పిస్తారు. కాని చాలా వరకు పాఠశాలల యాజమాన్యాలు వీటన్నింటిని పట్టించుకోకుండా ఇష్ఠారీతిగా బస్సులను నడిపిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (FC) లేకుండా రోడ్ల పైకి బస్సులను తీసుకువచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వాహనాలపై కొరడా ఝులిపించేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా రవాణా అధికారి ఎర్రిస్వామి సిద్ధమయ్యారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఎఫ్.సీ కోసం స్కూల్ బస్సులు పాటించాల్సిన నిబంధనలు:
1. నిబంధనల ప్రకారం బస్సు నెంబర్ పై పూర్తి చిరునామాతో పాటు పాఠశాల పేరు స్పష్టంగా రాయాలి.
2. బస్సులో ప్రయాణించేటప్పుడు విద్యార్థుల చిరునామా కేటాయించిన సీట్ నెంబర్ జాబితా డ్రైవర్ దగ్గర ఉండాలి
3. ప్రతి బస్‌కు కండీషన్ ఉండి ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి
4. పసుపు రంగు బస్సులను మాత్రమే నడిపించాలి
5. బస్సు పై భాగంలో నాలుగు వైపులా పసుపు రంగు పార్కింగ్ లైట్లను అమర్చాలి, బస్సు ఆపిన సమయంలో వాటిని వేయడం వలన ఇతర వాహనాలకు సూటిగా ఉంటుంది.
6. డ్రైవర్‌కు హెవీ లైసెన్స్‌తో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి, కచ్చితంగా 60 ఏళ్ల లోపు ఉండాలి. డ్రైవర్‌కు కాకి రంగు యూనిఫామ్ ఉండేలా చూసుకోవాలి.
7. ప్రతి నెలకు ఒకసారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి రవాణా సదుపాయం డ్రైవర్ అటెండర్ ఎలా ప్రవర్తిస్తున్నారు ఏమైనా పొరపాట్లు చేశారా బాధ్యతలు మరిచారా అనే విషయాలపై సమీక్షలు నిర్వహించాలి.
8. 15 ఏళ్లు దాటిన బస్సులను నడపవద్దు.
9. రోడ్డు భద్రత పై రవాణా శాఖ నిర్వహించే అవగాహన సదస్సులకు డ్రైవర్లు, క్లీనర్లు తప్పనిసరిగా హాజరవ్వాలి.
10. పరిమితికి మించి విద్యార్థులను బస్సులో ఎక్కనివ్వరాదు.
11. నెలకు ఒకసారి డ్రైవర్‌కు బీపీ, షుగర్, కంటిచూపు పరీక్షలు నిర్వహించాలి.
12. డ్రైవర్ క్లీనర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీఓ కార్యాలయంలో విధిగా అందజేయాలి.
13. డ్రైవర్, అటెండర్ పేరు ఫోన్ నెంబర్ బస్సు పై రాసి ఉండాలి.
14. బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగినప్పుడు వాటిని నియంత్రించేలా కార్బన్ డయాక్సైడ్ ద్రావణం సిలిండర్ ఉండాలి. ఎరుపు రంగులో కూడిన ఫైర్ సిలిండర్ డ్రైవర్ సమీపంలో ఉంచాలి.
15. బస్సులో డ్రైవర్ దగ్గరలో అత్యవసర ద్వారం ఉండాలి.
16, విద్యార్థులకు, రోడ్డుపై ఉన్నవారికి కనిపించేలా ఎర్రటి అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాసి ఉంచాలి.
17. విద్యార్థులు బస్సు ఎక్కడానికి మొదటి మెట్టు 32.5 ఎం ఎం ఎత్తు ఉండాలి. ఒక వేళ అలా లేని పక్షంలో విద్యార్థులను అటెండర్ బస్సులోకి ఎక్కించాలి.
18. విద్యాసంస్థల బస్సులో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు రవాణాశాఖ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో వాహనం నెంబర్ నమోదు చేయగానే యజమాన్యం, డ్రైవర్, అటెండర్ ఫోటోలతో పూర్తి వివరాలు ఫోన్ నెంబర్లు కనిపిస్తాయి.
19. బస్సు కింది భాగంలో మ్యాట్ పెట్టాలి. విద్యార్థులు పొరపాటున కిందపడినా గాయాలు తగలకుండా ఉంటాయి.
20. బస్‌కు హెడ్ లైట్లు, హారన్, విద్యార్థులు కూర్చునేందుకు అనువుగా సీట్లు, అన్ని కిటికీలకు అద్దాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
21. విద్యార్థులు కిటికీలోంచి తల బయట పెట్టకుండా ప్రతి కిటికీకి అనుసంధానంగా సేఫ్టీ గ్రిల్ అమర్చాలి.
22. డ్రైవర్‌కు ఇరువైపులా బస్సుకు లోపల బయట అద్దాలు అమర్చాలి. ప్రయాణ సమయంలో లోపల ఉన్న విద్యార్థులను, రోడ్డుపై వస్తున్న వాహనాలను,బస్సు డ్రైవర్ గమనించేలా అద్దాలను ఏర్పాటు చేయాలి.
ప్రైవేటు విద్యాసంస్థలు నడిపించే బస్సులో కచ్చితంగా ఈ నిబంధనలు ఉండాలని, ఈ నిబంధనలపై తల్లిదండ్రులు సైతం అవగాహన కలిగిఉండాలని నాగర్‌కర్నూల్ జిల్లా రవాణాశాఖ అధికారి ఎర్రిస్వామి \"న్యూస్ 18'కు ప్రత్యేకంగా వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.