NAGAR KURNOOL MINISTER KTR SAID THAT KOLHAPUR REGION IS LIKELY TO BECOME A JUNCTION FOR ANDHRA PRADESH AND TELANGANA STATES MBNR PRV
Mahbubnagar: ఆంధ్రాకు తెలంగాణకు జంక్షన్‌గా ఆ ప్రాంతం మారే అవకాశం.. నాగర్‌కర్నూల్ సభలో మంత్రి కేటీఆర్
మాట్లాడుతున్న కేటీఆర్
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగరకర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ. 170 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగరకర్నూల్ (NagarKurnool) జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గంలో రూ. 170 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ (Minsiter KTR) శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,. శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి. అనంతరం కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పని చేస్తుంది ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత మంచి నీటి కష్టాలు లేవు. ఎండాకాలం వస్తే రైతుల నిర్బంధిస్తారని, విద్యుత్ అధికారులు సబ్ స్టేషన్లలో ఉండేందుకు భయపడేది. ఇప్పుడు కరెంట్ కష్టాలు కూడా లేవు. వివిధ ప్రభుత్వాల్లో కానీ పనులు కేసీఆర్ నాయకత్వంలో పరిష్కారం అయ్యాయి” అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) తన అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చారని మంత్రి కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని, అర్థవంతమైన మాటలు మాట్లాడటం లేదని మండిపడ్డారు. హిందూ ముస్లిం మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు మంత్రి. కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దు.. మనకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. అభాగ్యులకు ఆసరాగా నిలిచే ప్రభుత్వం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉంది. ఎవరెన్ని కారుకూతలు కూసినా పట్టించుకోవద్దు అని మంత్రి సూచించారు.
వచ్చే నెలలో కొత్త పెన్షన్లు.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
8 ఏండ్లలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించామని కేటీఆర్ తెలిపారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను పది రెట్లు పెంచి రూ. 2016 ఇస్తున్నామని తెలిపారు. 2014కు ముందు కేవలం 29 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండే.. ఇప్పుడు ఆ సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ. 800 కోట్లు ఖర్చు పెడితే.. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని చెప్పారు. కరోనాతో పాటు ఇతర సమస్యల కారణంగా గత మూడేండ్లుగా కొత్త పెన్షన్లు రాలేదని,. వారందరికీ జులై, ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు లేని వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ఏపీ, తెలంగాణకు జంక్షన్‌గా ..
కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గోపాల్ దిన్నె రిజర్వాయర్ ద్వారా 25 వేల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నామని కేటీఆర్ తెలిపారు. బాచారం హై లెవల్ కాలువను మంజూరు చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. ‘‘సోమశిల మీద బ్రిడ్జి కావాలని ఎమ్మెల్యే మొండిపట్టు పట్టి సాధించారు. ఆంధ్రాకు, తెలంగాణకు మధ్య కొల్లాపూర్ జంక్షన్‌గా మారిపోయే అవకాశం ఉంది. మామిడి మార్కెట్‌ను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చామన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలను తేవాలని ఎమ్మెల్యే కోరారు. భూమిని కేటాయిస్తే తప్పకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తీసుకొస్తాం. సోమశిలలో 35 కాటేజీలు నిర్మించాం. అమరగిరిలో కూడా ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం. ఉద్యానవన పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తాం=. 98 జీవోను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం”అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే అభిమతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 8 ఏండ్లలో ఏ రాష్ట్రంతోనూ ఎలాంటి పంచాయితీలు పెట్టుకోలేదు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేసుకుంటూ ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు మాత్రం ఒకటే లక్ష్యం పెట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటుండు. రైతుల బతుకులు మారుస్తానని అంటున్నాడు. ఆ పార్టీకి ఎన్నో చాన్సులు ఇచ్చాం. 50 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. నెహ్రూ నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాకా ఈ దేశాన్ని ఏలారు. అయినా అభివృద్ధి జరగలేదు.
తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. వారి పోకడ చూస్తుంటే హంతకులే సంతాపం తెలిపినట్లు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. వారికి చరిత్ర మాత్రమే మిగిలింది. భవిష్యత్ సున్నా. ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పరాభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉద్దరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కులపిచ్చి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు..
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.