Home /News /telangana /

NAGAR KURNOOL MAOSIT CALLED PEOPLE AWIDE 75 YEARS INDEPENDENCE CELEBRATIONS NNK ABH BRV

Nagarkurnool: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను బహిష్కరించండి.. మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలు నిర్వహించాలంటూ ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలకు సిద్ధం చేస్తుంటే... మరో పక్క ఆ ఉత్సవాలను బహిష్కరించసిందిగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలు నిర్వహించాలంటూ ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలకు సిద్ధం చేస్తుంటే... మరో పక్క ఆ ఉత్సవాలను బహిష్కరించి, ఆ దినాన్ని నిరసన దినంగా పాటించవలసిందిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈమేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆగష్టు 5న ఓ లేఖ విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రకారం

  భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వంటి విప్లవ నాయకులు, బిర్సా ముండా, గూండాదూర్, గేంద్ సింగ్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఆదివాసీ పోరాట నాయకులు, మరెందరో ప్రజలూ రక్తతర్పణ చేస్తూ బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, భారత బడా భూస్వామ్య, దళారీ బూర్జువా వర్గాలు ఈ స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసాయని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నేతలు ఆరోపించారు. బ్రిటిషు వారి నుంచి అధికార పగ్గాలు అందుకుని దేశంపై నయావలస దోపిడీని కొనసాగించాయని మండిపడ్డారు. భారతదేశం అర్థవలస, అర్ధభూస్వామ్య దేశంగా మారిందని ఆనాటి నుంచి దేశ దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క దేశాన్ని మరింతగా సామ్రాజ్యవాదులకు అమ్మివేస్తూ, మరో పక్క 75 సంవత్సరాల నామమాత్రపు స్వాతంత్య్రాన్ని పెద్ద ఎత్తున జరపబోతున్నాయని వివరించారు.

  దేశ ప్రాకృతిక వనరులను దోపిడీ చేస్తూ దళారీ వర్గాలు ప్రజలను మరింతగా పేదరికంలోకి నెడుతున్నాయని చెప్పారు. రోజుకు రూ.20 కంటే తక్కువ రాబడితో దేశంలో 77 శాతం మంది, అంటే 80 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్నదని విమర్శించారు. అధికార మార్పిడికి ముందు కాలంలోనే బ్రిటిషు సామ్రాజ్యవాదులకు దళారులుగా ఆవిర్భవించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాల దృష్ట్యా అనేక అంశాలలో ప్రజా వ్యతిరేక పాత్ర వహిస్తున్నదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ-అమిత్ షా నేతృత్వంలో ప్రస్తుత బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర ప్రభుత్వం... దేశంలో అనేక మందిని పౌరులుగా గుర్తించడానికి నిరాకరించి సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆరీలను ముందుకు తీసుకువచ్చిందని ఘాటు విమర్శలు చేశారు.

  ప్రారంభంలో దేశ పాలక వర్గాలు పేదరిక నిర్మూలన, ఉపాధి, భూమి కల్పనకు పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారని కూడు, గుడ్డ, గూడు, తాగు నీళ్లు వంటి మౌలిక వసతులకు హామీనిచ్చారని తెలిపారు. అయితే అవన్నీ సామ్రాజ్యవాదుల, దేశ దళారీ పాలకుల ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారని చెప్పారు. దేశ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడలేదని చెప్పారు. 75 సంవత్సరాల తరువాత కూడా దేశంలో సగానికి పైగా మంది జనాభా రోజుకు ఒక్కసారి మాత్రమే తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరల వల్ల ప్రజలు తమ రోజువారీ సరుకులను కొనుగోలు చేయలేకపోతున్నారని దళారీ పాలనలో దేశంలో బిలియనీర్ల సంఖ్య 90 నుంచి 140కి పెరిగిందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం బిలీనీర్ల వద్దనున్న సంపద దేశంలో 55 శాతం ప్రజల వద్ద ఉనన్న సంపదతో సమానమని అంచనా వేశారు.

  ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా భారత బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ చెప్పుకుంటుందన్నారు. కశ్మీరు జాతి విముక్తి పోరాటంలో 80 వేల మంది మిలిటెంట్లను కాల్చి చంపారని తెలిపారు. న్యాయవ్యవస్థ రాజ్యం చేతిలో కీలుబొమ్మగా మారిందని పిటిషనర్లకు జరిమానా విధిస్తున్నారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది. 'ఘర్ ఘర్ తిరంగా' అంటూ దేశ ఫాసిస్టు పాలకులు ఎత్తిపట్టే మూడు రంగుల జెండా వల్ల ప్రజలకు దక్కిందేమీ లేదని, "ఇంటింటా చీకటే ప్రతి కంటా కన్నీరే" ఉన్నదని చెప్పుకొచ్చారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కానీ ప్రజల రోజువారీ జీవిత సమస్యల గురించి ఏ మాత్రం శ్రద్ధ వహించదని సీపీఐ నేత లేఖలో పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అర్ధవలస, అర్ధభూస్వామ్యంగా కొనసాగుతూ మరింత దళారీగా విస్తరణవాదిగా మారుతున్నదన్నారు. భాజపాకి వ్యతిరేకంగాను, దోపిడీ, అభద్రత లేని ప్రజా జీవనం కోసం, ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం యావత్తు పీడిత వర్గాలను, పీడిత జాతులనూ ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు.

  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను బహిష్కరించండి.. మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు