(N . Naveen Kumar, Nagar Kurnool)
అరేబియన్ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani)… ఇప్పుడు నాగర్ కర్నూల్ (Nagar Kurnool) వాసులను నోరూరిస్తోంది. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యాని (Hyderabad Biryani) అనే వాళ్లంతా ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఈ మండీ హోటల్స్ (Mandi Hotels) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.
అందరూ కలిసి ఒకే పాత్రలో ఆరగించండి.!
సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్‌లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్‌లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు (Friends), ఫ్యామిలీ మెంబర్స్ (Family members) గ్రూప్‌గా వచ్చి అందరూ కలిసి ఒకే ప్లేట్‌లో ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్‌లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు.
అరబ్ స్టైల్‌ను అనుసరిస్తున్న హోటళ్లు
ఒకే కంచంలో అందరూ కలిసి తినడం అనేది అరబిక్ (Arabic) సంప్రదాయంలో భాగం. యెమన్, సౌదీ అరేబియా, ఒమన్, సోమాలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. పీట చుట్టూ కూర్చొని ఆ పీటపై ఉంచిన పెద్ద ప్లేటులో వడ్డించిన మండీ (Mandi Biryani)ని అందరూ కలసి తింటారు. అదే ఇప్పుడు భోజన ప్రియులను కట్టిపడేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేసే సంస్కృతి దాదాపుగా కనుమరుగైపోయింది. ఎవరికి సమయాన్ని బట్టి వారు తినేస్తున్నారు. బయట రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు మాత్రమే కాస్త కలసి భోజనం చేస్తుంటారు. కానీ ఒకే కంచంలో కలిసి భోజనం చేసే సంస్కృతి ని అరేబియన్ మండీ రెస్టారెంట్లు తిరిగి తెచ్చాయని చెప్పవచ్చు.
బిర్యానీ తయారుచేసే విధానం కూడా ప్రత్యేకమే
మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్, చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు.
ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్‌మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్‌లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు.
బిర్యానిలో పోషక విలువలు అనేకం
మండీ బిర్యానీ (Mandi Biryani) పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు. ఈ మండీ బిర్యానీ (Mandi Biryani) పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్‌మిస్ తదితర డ్రై ఫ్రూట్స్ (Dry fruits)ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
రెండు, మూడు ఏళ్లలోనే సిటీ నుంచి పట్టణాలకు..
కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే మండీ (Mandi) జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. పెద్ద సంఖ్యలో ఆరేబియన్ రెస్టారెంట్లు (Arabian Restaurants) వెలుస్తున్నాయంటే కారణం మండీయే. ఈ మండీ ధర సాధారణ బిర్యానీలానే అందుబాటులో ఉండడం వల్ల యువతకు బాగా చేరువైంది. అలాగే మరోవైపు చూడడానికి బిర్యానీ తరహా రుచి, పొడిగా ఉండడం వల్ల యువతకు బాగా నచ్చుతోందని ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు.
Mr. Sonu mandi రెస్టారెంట్ నిర్వాహకుల మాటల్లో…. నాగర్ కర్నూలు వాసులు కొత్త రకం వంటకాలను కోరుకుంటుంటారనడానికి మండీ రెస్టారెంట్లకు వస్తున్న ఆదరణే సాక్ష్యం. ఒకప్పుడు చాలా మందికి వీటి గురించి తెలియదు. కానీ ఇప్పుడు అందరికీ పరిచయవ్వడంతో వీకెండ్స్, సెలబ్రేషన్స్ టైంలో ఇంకా ఎక్కువగా వస్తున్నారు. ఈ మండీ రెస్టారెంట్‌లో కలసి భోజనం చేయడమే కాదు..ఒకే కంచంలో చేయడం, అందులోనూ ఎంచక్కా కింద కూర్చొని తినడం మధురానుభూతిని ఇస్తోందని కస్టమర్లు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Biryani, Chicken biryani, Nagarkurnool