(Syed Rafi, News18,Mahabubnagar)
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలిసిన అలంపూర్ జోగులాంబ శక్తి పీఠంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి 18 వ వార్షిక బ్రహ్మోత్సవాలను జనవరి 22 నుంచి 26వ తారీకు వరకు కొనసాగులున్నాయి. ఏటా వసంత పంచమి పురస్కరించుకొని ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది పంచాహ్నిక దీక్ష పేరిట బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఆదివారం ఉదయం ఆనతి స్వీకరణ 8 గంటలకు అమ్మవారి యాగశాల ప్రవేశం పుణ్యవా వాచనం మహాగణపతి పూజ, ఋత్విక వరణం, మహా కలశ స్థాపన ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మృథ్ సంగ్రహణం, అంకురారోహణం షట్పత్ర ప్రయోగం, ధ్వజారోహణం నిర్వహిస్తారు. 23 నుంచి 25వ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ, ఆవాహిత దేవత పూజలు , మండపారాధన హోమాలు, నిత్య బలిహారం, విశేష అర్చనలు, చండీ హోమాలు , పవమాన సూక్త పారాయణ సహిత హోమాలు, నిత్య నైవేద్యాలు, మహా మంగళహారతి, తీర్థప్రసాదాల వితరణ ఉంటాయి.
26న అమ్మవారి నిజరూప దర్శనం అదే రోజు వసంత పంచమి సందర్భంగా గ్రామ ప్రజలంతా జోగులాంబ సేవాసమితి ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సేవా సమితి తరపున ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు అభిషేక ద్రవ్యాలు సమర్పిస్తారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి యాగశాలలో నిత్య హోమాలకు మహా పూర్ణాహుతి కలశ ఉద్వాసన సహస్ర గంటాలకు ఆవాహనం అర్చన అనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారి మూల విరాట్ కు స్వపనం పంచామృత అభిషేకం జరుగుతుంది.
ఈ సమయంలోనే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజున ప్రదోషకాలంలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం ధ్వజారోహణతో కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి.బ్రహ్మోత్సవాలకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.
ఇందులో కర్నూలు కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే తో పాటు తెలంగాణలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సినిమా నిర్మాత రాజమౌళి తండ్రి విజయేందర్ ప్రసాద్, మాజీ హోం మంత్రి దేవేంద్ర గౌడ్, ఎమ్మెల్యే అబ్రహం, డీకే అరుణ, కె.వి.రమణాచార్యులు, బెంగళూరు మాజీ కలెక్టర్ రామాంజనేయులు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఆధ్యాత్మిక ప్రవచనాకర్త డాక్టర్ బాదేపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, సి ఎస్ శాంతకుమారి తదితరులను ఆహ్వానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mahabubnagar, Telangana