Naveen Kumar, News18, Nagarkurnool
పక్షులు, జంతువులను చూస్తే చిన్నారులు కేరింతలు కొడుతుంటారు. అయితే చదువులు, ఉద్యోగాలంటూ కాంక్రీట్ జంగిల్‌కే పరిమితమౌతున్న నేటి కాలంలో స్వేచ్ఛగా తిరిగే జంతువులు ఎక్కడ కనిపిస్తాయి? అడపాదడపా తల్లిదండ్రులు తమ పిల్లలను 'జూ' కి తీసుకెళ్లినా... అక్కడి బోనులో బందీగా ఉన్న జంతువులను చూస్తే ఆ చిన్ని మనసు కూడా బాధపడుతుంది. స్వేచ్ఛగా తిరిగే జంతువులను చూస్తే చిన్నారులకు ఎంతో ఆనందం, అనుభూతి కలుగుతాయి. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలోని ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో కుందేళ్లు సందడి చేస్తున్నాయి. చెంగు చెంగున గెంతుతున్న ఈ కుందేళ్లను చూసేందుకు సాయంత్రం వేళ చిన్నారులు పరిగెత్తుకు వస్తున్నారు. కుందేళ్ళతో ఆడుకోవడానికి, వాటికి ఆహారం అందించి కేరింతలు కొడుతున్నారు. వాటి కదలికలను చూసి వాటితో ఆడుకుంటూ మురిసిపోతున్నారు.
పట్టణానికి చెందిన కారు డ్రైవర్ హబీబ్ జంతువులను పెంచడం ఒక హాబీ. ఇందులో భాగంగానే రెండు సంవత్సరాలుగా కుందేళ్ళను పెంచుతున్నాడు. ఈ కుందేళ్లను ప్రతి రోజు సాయంత్రం నాగర్‌కర్నూల్ పట్టణంలోని ట్యాంక్ బండ్ పైకి తీసుకొస్తాడు. అక్కడ గడ్డిపై కుందేళ్లు చెంగుచెంగున గెంతుతూ సందడి చేస్తున్నాయి. దీంతో పాఠశాల ముగించుకుని ఇంటికి వచ్చే చిన్నారులు ఈ కుందేళ్ళను చూసి అబ్బుర పడుతున్నారు. చిన్నారులు కుందేళ్ళతో ఆడుకోవడం చూసి చాలా సంతోషం అనిపిస్తుందని. వారి సంతోషం తనకు సంతృప్తి ఇస్తుందని హబీబ్ చెప్పుకొచ్చాడు.
ఎక్కువ సంఖ్యలో కుందేళ్లు పుట్టినప్పుడు తోటి జంతు ప్రేమికులకు వాటిని అందిస్తుంటానని చెప్పాడు. వాటిని పెంచగల శక్తి ఉన్నవారికి ఆసక్తి ఉన్నవాళ్లకే ఇస్తానని, వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పాడు. తన దగ్గర మొత్తం ప్రస్తుతానికి ఆరు కుందేళ్లు ఉన్నాయని అందులో నాలుగు చిన్నవి రెండు పెద్దవని చెప్పాడు. వీటికి ప్రతి రోజు కూరగాయలను ఆహారంగా అందిస్తున్నాడు. వీటి ద్వారా తాను ఎంతో సంతృప్తి పొందుతున్నానని వివరించారు. హబీబ్ జంతు ప్రేమికుడు. ఫోన్ నెంబర్: 9550839155
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana