Home /News /telangana /

NAGAR KURNOOL IN SEPERATE ROAD ACCIDENTS TWO PEOPLE LOST LIVES IN NAGARKURNOOL DISTRICT ABH BRV NNK

Nagarkurnool: కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

నాగర్ కర్నూల్ పరిధిలో నేరాలు

నాగర్ కర్నూల్ పరిధిలో నేరాలు

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం సమీపంలోని జాతీయ రహదారి మల్లంబావి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

    (Naveen Kumar, News 18, NagarKurnool)

    పాము కాటుకు గురై బాలుడు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం నర్సంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. చౌడంపల్లికి చెందిన మల్లేష్, విమలల కుమారుడు ప్రసాద్(11) ఆదివారం పొలం వద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు బయలుదేరాడు. నడుచుకుంటూ వెళ్తున్న ప్రసాద్‌ను పాము కాటు వేసింది. బాలుడు భయంతో ఏడ్చుకుంటూ వెళ్లి పొలం వద్ద ఉన్న తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. వారు వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం కల్వకుర్తికి తరలిస్తుండగా ప్రసాద్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ప్రసాద్ సర్వారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

    వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం సమీపంలోని జాతీయ రహదారి మల్లంబావి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వనపర్తికి చెందిన రామచంద్రయ్య (60) ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్ వెళ్తున్నాడు. అదే సమయంలో కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈప్రమాదంలో రామచంద్రయ్య అక్కడిక్కడే మృతి చెందగా, లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.

    నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో కారు అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పదర ఎస్ఐ తిరుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు కారులో అచ్చంపేటకు వెళ్తుండగా... వంకేశ్వరం గ్రామ శివారులో కారు టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న కుండాల శ్రీను(23) తీవ్రంగా గాయపడగా, మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన శ్రీనును అచ్చంపేట సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో ఐదు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం లింగాలకు చెందిన నిర్మల పోచమ్మ (45) జులై 26న ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఎంతకు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈక్రమంలో ఆదివారం నాడు చాకలి గుట్ట వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని పోచమ్మ మృతి చెందినట్లు కుటుంబ సబ్యులకు సమాచారం అందింది. కొంతకాలం నుంచి పోచమ్మ చాతి నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై మృతురాలి కూతురి ఫిర్యాదు మేరకు ఎస్సై రవి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు