Home /News /telangana /

NAGAR KURNOOL HOW BANJAR WOMEN MAKE THEIR DRESS AS PART OF THEIR CULTURE AND WHY IS THE PRICE SO HIGH PRV BRV NNK

Nagarkurnool: లంబాడీ మహిళల వస్త్రధారణ వెనుక ఇంత ఉందా? ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

లంబాడీలు

లంబాడీలు

సాధారణ వస్త్రంలో అద్దాలు, గవ్వలు, పూసలు ఇలా మరికొన్ని అలంకరణ వస్తువులను జోడించి రూపొందించే వీరి వస్త్రాలు..ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే వీరి ఈ వస్త్రధారణ, తయారీ వెనుక చాలా శ్రమ దాగి ఉంది.

    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    అనేక జాతులు, సంస్కృతుల సమాహారం మన భారత దేశం. భిన్న జాతులు, ఆచారాలు, సంస్కృతులను (Culuture )జీవన విధానంగా మార్చుకుని వందల ఏళ్లుగా కొనసాగిస్తున్నారు భారతీయులు. అన్ని సంస్కృతులు వేటికవే ప్రత్యేకమైనవే. వారి వారి ఆచారాలను బట్టి అవి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మన భారతీయ ఆచారాల్లో ప్రముఖంగా వినిపించేది వస్త్రధారణ. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతీయుల సాంప్రదాయ వేషధారణ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగి భిన్నమైన సంస్కృతి నేటికీ కొనసాగిస్తున్నారు లంబాడీలు. లంబాడాల అలంకరణ, దుస్తులపై (Lambadas dress) న్యూస్ 18 ప్రత్యేక కథనం అందిస్తుంది.

    వస్త్రధారణే ప్రత్యేక గుర్తింపుగా లంబాడీలు:

    లంబాడీలు (Lambadi) పూర్వకాలం నుంచి వస్తున్న తమ వస్త్రధారణను (Dressing) నేటికి ఆచరిస్తూ వస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా భారత దేశంలో ఒక జీవన సంస్కృతిగా కొనసాగుతున్న లంబాడాలు గతంలో ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఉండేవారు. కాలక్రమేణా జరిగిన పరిణామాల దృష్ట్యా దేశమంతటా వీరు వలస వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లినా తమ వస్త్రధారణను కొనసాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా లంబాడా మహిళలు ధరించే వస్త్రాలు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. సాధారణ వస్త్రంలో అద్దాలు, గవ్వలు, పూసలు ఇలా మరికొన్ని అలంకరణ వస్తువులను జోడించి రూపొందించే వీరి వస్త్రాలు..ప్రత్యేకంగా నిలుస్తాయి. అయితే వీరి ఈ వస్త్రధారణ, తయారీ వెనుక చాలా శ్రమ దాగి ఉంది. అన్నిటికి మించి ఆ వస్త్రాల తయారీకి అవుతున్న ఖర్చు ప్రస్తుతం బాగా పెరిగిపోయింది.



    లంబాడాలు (Lambada) ధరించే వస్త్రధారణ వారికి సమాజంలో ఒక ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. పూర్వకాలంలో సేవాభాయ్ అనే కులపెద్దకు గుర్తుగా ఈ డ్రెస్ వేసుకోవడం ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. రంగు రంగుల లంగా, జాకెట్‌లతో.. అద్దాలు, పూసలు వంటి 20 రకాల అలంకరణ సామాగ్రితో వీరి వస్త్రదారణ ఉంటుంది. శతాబ్దాలు గడిచినా తరాలు మారినా లంబాడాలు ఈ వస్త్రదారణను నేటికీ ఆచార సాంప్రదయాలుగా పాటిస్తూనే ఉన్నారు. గతంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ వస్త్రాలు ధరించేవారు. ప్రస్తుతం వివాహం అనంతరం కొందరు మహిళలు ఈ వస్త్రాలను ధరిస్తున్నారు.

    కొంత కాలంపాటు ఈ వస్త్రధారణ నిర్లక్ష్యానికి గురైనప్పటికీ తిరిగి పూర్వ ఆచారాలను పాటించేందుకు నేటి తరం మహిళలు ఆసక్తి చూపుతున్నారు. పెళ్లి సాంప్రదాయాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రధారణను చేరుస్తున్నారు. పెళ్లి కొడుకు తల్లికి పెళ్లి కూతురు తరుపువాళ్లు లంబాడ వస్త్రాలను బహుమతిగా ఇవ్వడం ఆచారంగా వస్తుంది. పెళ్లిలో వివాహ కార్యక్రమం ముగిసిన తరువాత పెళ్లి కూతురుకు తలపై అద్దాలతో కూడిని గుంగుటం వేస్తారు. వాటితో పాటు కీచన్, మాట్లీ, వాంకిడీ, బలియా, పులియాగోండో, కరప్రీ, కటన్ భాందేరో వంటి రకరకాల అలంకరణ సామగ్రిని ధరిస్తారు.

    ఒక వస్త్రం తయారీకి అయ్యే ఖర్చు తెలిస్తే..

    ఇంత ప్రత్యేకత ఉన్న లంబాడీ వస్త్రాల ధర కూడా అదే స్థాయిలో ఉంది. ఒక్కో డ్రెస్ ధర రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుందని వస్త్ర తయారీ దారులు పేర్కొన్నారు. వీటితో పాటు వెండి అలంకరణ సామగ్రిని జత చేస్తే ధర రూ. 50,000 వరకు పలుకుతుంది. హైదరాబాద్ నుంచి క్లాత్ మెటీరియల్ తీసుకొచ్చి ఈ డ్రెస్ ను తయారు చేస్తారు. మిషన్ మేడ్, హ్యాండ్ రకాలతో వర్క్ చేస్తారు కాబట్టి ఈ డ్రెస్ కు ధరను ఎక్కవగా నిర్ణయించారు. లంగాకు రూ. 5000, జాకెట్ కు రూ.4000, తలపై వేసుకొనే గుంగుటంకు రూ.5 వేలు, తైలీ (సంచి)కి రూ.2వేలు, ఇలా ప్రతి పీస్‌కు ఒక్కో ధర నిర్ణయిస్తారు. చేతి పని ఎంత ఎక్కువగా ఉంటే ధర కూడా ఎక్కువగా ఉంటుందని ఒక డ్రెస్ తయారు చేసేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని తయారీదారు వివరించారు.

    నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో..

    నాగర్‌కర్నూల్  (NagarKurnool) జిల్లా లింగాల మండల కేంద్రంలో జురుపుల దశరథం షాప్‌ను ఏర్పాటు చేసుకొని లంబాడి వస్త్రాలు విక్రయిస్తున్నారు. తమ తాతల కాలం నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇంటిల్లిపాది కష్టపడి బట్టలు కుట్టి జీవనం సాగిస్తున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad), రాజస్థాన్ (Rajasthan)నుంచి మెటీరియల్స్ తీసుకువచ్చి..డ్రెస్ (Dress) తయారుచేసి అమ్ముతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సింగోటం, దేవరకద్రా వంటి సంతలో ఎక్కువగా వీటిని విక్రయిస్తామని చెప్పుకొచ్చారు.

    జరుపుల దశరథం ఫోన్ నెంబర్: 7386411610
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Culture, Local News, Nagarkurnool, Tribes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు