(N.Naveen Kumar,News18,Nagarkurnool)
పాలమూరు పల్లికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
'అప్లాటాక్సిన్' శాతం తక్కువ ఉండటమే కారణం
నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో అధికంగా పల్లి సాగు
నాగర్కర్నూల్ జిల్లాలో వానాకాలం 1,904, యాసంగిలో 1,50,000 ఎకరాల్లో పల్లి సాగు
ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ పల్లి ధర రూ.5,269
=================================================================
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగయ్యే వేరుశనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పాలమూరు పల్లీకి మంచి గుర్తింపు, డిమాండ్ ఉంది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో పండించే వేరుశనగలో అప్లాటాక్సిన్ శిలీంద్రం శాతం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఈ శిలీంద్రం శాతం తక్కువగా ఉండటంతో ఇక్కడి ప్రాంతాల్లో పండించే వేరుశనగలు నాణ్యతగా మంచి రుచితో ఉంటాయి.వేరుశగన పంటకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. వంట నూనెగానూ, ఇతర ఆహార పదార్ధాల తయారీలోనూ, వివిధ రకాల ఔషదాల(Medicines) తయారిలోనూ వేరుశనగలు వినియోగిస్తుంటారు. వాణిజ్య పరంగానూ ఈ వేరుశనగలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువగా సాగవుతుంటాయి. నాగర్కర్నూల్(Nagarkurnool), వనపర్తి(Vanaparthy)జిల్లాలోని సారవంతమైన నేలలు వేరుశనగ(Peanut)పండించేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పరిస్థితులను గమనించిన ఇక్కడి రైతులు వానాకాలంలో కంటే ఎక్కువగా యాసంగిలో వేరుశనగ సాగు చేస్తుంటారు. నాగర్కర్నూల్ జిల్లాలో వానాకాలం పంటల సాగులో 1,904 ఎకరాల్లో వేరుశనగ సాగు చేపడుతుండగా యాసంగి సీజన్లో 1,50,000 పైగా ఎకరాల్లో పల్లీ సాగు చేస్తుంటారు రైతులు.
అప్లాటాక్సిన్ శిలీంద్రం శాతం తక్కువ:
వేరుశనగ పంటలో అప్లాటాక్సిన్ అనే శిలీంద్రం ప్రభావం వలన పంట నాణ్యతను కోల్పోతుంది. మొక్క ఎదుగుదల సమయంలో ఈ శిలీంద్రం కాయ, పూల తలకు సోకడంతో వేరుశనగల రుచిని తగ్గించి వాటిలో నూనె శాతాన్ని తగ్గిస్తాయి.ఈ శిలీంద్ర ప్రభావంతోపల్లీ కాయలు సైజు తగ్గి.. చేదుగా ఉంటాయి. ఇలాంటి పంటలకు మార్కెట్లో పెద్దగా ఆదరణ ఉండదు, ఫలితంగా రైతులు పంటలను నష్టపోతుంటారు. కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగయ్యే వేరుశనగ పంటల్లో అప్లాటాక్సిన్ శిలీంద్రం శాతం చాలా తక్కువగా ఉంటుంది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలోని సారవంతమైన నేలలు వేరుశనగ పంట ఎదుగుదలకు సహకరిస్తాయి. ఈ ప్రభావాలతో ఇక్కడి పండించే వేరుశనగలు నాణ్యతతో కూడుకొని నూనె శాతం ఎక్కువగా ఉంటూ ఎంతో రుచి కలిగి ఉంటాయి. సైజు తక్కువగా ఉండి చేదుకలిగిన వేరుశనగలు శాతం చాలా తక్కువగా ఉంటాయి.
అంతర్జాతీయ స్థాయిలో పాలమూరు పల్లికి డిమాండ్:
నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో సాగుచేసే వేరుశనగ పంటలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. నాణ్యతతో కూడి నూనె శాతం ఎక్కవగా ఉండటం, మంచి రుచిని కలిగి ఉండటం వలన ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతాయి. చిరు ధాన్యాల్లో ఎక్కువగా ఎగుమతయ్యే పంటల్లో వేరుశనగ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో క్విటాళ్ పల్లీ ధర రూ.5,269గా ఉంది. మంచి లాభాలు ఉండడంతో రైతులు వానకాలం, యాసంగి సీజన్లో వేరుశనగ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నేల స్వభావమే కారణం: వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్
\"నాగర్కర్నూల్ జిల్లాలోని నేలలు వేరుశనగ పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. అప్లాటాక్సిన్ శిలీంద్రం శాతం తక్కువగా ఉండటం వలన మంచి నాణ్యతతో పంట పండడంతో పాటు పల్లీలు రుచిగా ఉంటాయి. ఇలాంటి పంటలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. లాభాలు వస్తుండటంతో రైతులు యాసంగితో పాటు వానాకాలం సీజన్లో కూడా వేరుశనగను సాగుచేస్తున్నారు\" అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లు న్యూస్ 18 ప్రతినిధికి తెలిపారు.పల్లీ సాగుపై మరింత సమాచారం కోసం నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లుని సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 7288894286.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool