Naveen Kumar, News18, Nagarkurnool
కుల వృత్తులను ప్రోత్సహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా కుల వృత్తుల వారికీ స్వయం ఉపాధి రుణాలు కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుమ్మరి వృత్తుల వారికి చేయూత నిచ్చేలా 80 శాతం సబ్సిడీపై అధునాతన పనిముట్లు, యంత్రాలు, ముడి సరుకులు అందిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా (Nagar Kurnool District) లో పలువురు కుమ్మరి వృత్తుల వారికీ శిక్షణ అందించడంతో పాటు లబ్దిదారుల ఆర్థిక స్వావలంబన కోసం మోడ్రన్ పాటరీ (pottery) కిట్లను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకొన్న 9 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఈ ఆధునిక పాటరీ యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో పాటరీ యూనిట్ ఖర్చు రూ.లక్ష ఉండగా, అందులో రూ.80 వేలను ప్రభుత్వ సబ్సిడీగానూ రూ. 20 వేలను లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో సుమారు 5,600 కుమ్మరి కుటుంబాలు ఉండగా వీరిలో కొన్ని కుటుంబాలు కుల వృత్తులను చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతున్నారు. కుండలు, రంజన్‌లు, మట్టి పాత్రలను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతుంటారు. పాత్రల తయారీకి అవసరమైన మట్టి, ఇతర ముడిసరుకులు, పరికరాల కోసం కుమ్మరులు అధిక మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. పెట్టుబడి లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో కుల వృత్తులను ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా కుమ్మరి కులస్థులకు స్వయం ఉపాధి రుణాలను అందితున్నారు. కుమ్మరి యువజనులకు రుణాలను అందించడానికి 2018లో నాగర్ కర్నూలు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న తొమ్మిది మందికి హైదరాబాదులోని రామానందతీర్థ ఇన్స్టిట్యూట్‌లో నాలుగు రోజులపాటు వివిధ రకాల మట్టిపాత్రల తయారీలో శిక్షణ ఇప్పించారు. వీరంతా మట్టి గణపతులు, దీపాంతలు, మట్టి గ్లాసులు, జగ్గులు, వాటర్ బాటిల్స్ తదితర మట్టి పాత్రల తయారీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
తాజాగా అధికారులు రెండో విడత యంత్రాలు అందించేందుకు ధరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రధానంగా కుమ్మరి కుల వృత్తులకు అవసరమైన పనిముట్లు, ఆధునిక యంత్రాలు, ముడి సరుకును అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టైప్-1, టైప్-2ల వారీగా యూనిట్లను అధికారులు కేటాయిస్తున్నారు. టైప్-1లో రూ. లక్ష విలువ గల అధునాతనంగా తయారు చేసిన పగ్ మిల్ యంత్రం, 100 కేవీ కెపాసిటీ గల బ్లెంజర్, టూల్ కిట్, 1 హెచ్‌పీ మోటార్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ యంత్రాన్ని అందించనున్నారు. టైప్- 2లో కుండలు, గ్లాస్‌ల తయారీకి సంబందించి రూ. లక్ష విలువ గల డైమేకింగ్ మిషన్‌లు, 100 ఎంఎల్ టీ కప్ డై, బుండి మిషన్ అందించనున్నారు.
మట్టి పాత్రలకు పెరిగిన డిమాండ్: ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఇతర ప్రత్యామ్న్యాయాలపై మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలోనే మట్టి పాత్రలకు డిమాండ్ పెరిగింది. శుభకార్యాలకు పెళ్లి పాత్రలు, గౌరీ దేవి నోము పాత్రలు, రంజన్‌లు, తాబేలు బుర్ర, కూజలు, నీళ్ల కుండలు, దీపాలంకరణ కోసం చిప్పలను వినియోగిస్తున్నారు. అలంకరణ వస్తువుల కోసం కూడా మట్టి పాత్రలను విరివిగా ఉపయోగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana