రిపోర్టర్ :నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
సకల సృష్టి చక్రాన్ని తన లీలలతో మానవాళిని ముందుకు నడిపిస్తున్న ఆదిపరాశక్తి నడిగడ్డ ఆరాధ్య దేవతగా నడిగడ్డ ఇలవేల్పుగా కొలిచిన వారికి కొంగుబంగారంగా కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా విరాజిల్లుతున్న జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ప్రాణభం కానున్నాయి. ఈఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం జమ్మిచేడు గ్రామంలో వెలసిన జమ్ములమ్మ అమ్మవారికి పుట్టింటి నుంచి గుర్రంగడ్డ (దివిసీమ) ఆలయ సిబ్బంది సాంప్రదాయపద్ధంగా తీసుకెళ్లారు. పుట్టిలో అమ్మవారిని తీసుకెళ్లి గుర్రం గడ్డ వద్ద ప్రత్యేక పూజలు చేసి తిరిగి అమ్మవారిని జమ్మి చేయుటకు సాంప్రదాయ బద్ధంగా తీసుకువస్తారు. మాఘశుద్ద పౌర్ణమి కంటే ముందు వచ్చే మంగళవారం అమ్మకు మెట్టినింటికి తీసుకు వెళ్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం మాఘశుద్దపౌర్ణమిన అమ్మవారిని కొలిచేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తూ ఉంటారు.
ఈ ఆలయ అమ్మవారు వెలసిన చరిత్రను పరిశీలిస్తే..ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక రైతు పొలంలో దున్నుతుండగా గడెంలోతుగా వెళ్లేందుకుదానిపై ఒక బరువు పెట్టేందుకు ఒక రాయి కోసం వెతికాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక రాయితీసుకెళ్ళి ఆ గడానికి అమర్చాడు. రాయిని అమర్చాక ఆ రైతు పొలం దున్నాడు. పొద్దు వాలిన తర్వాత రైతు దున్నే కార్యక్రమాన్ని నిలిపివేశారు. మరుసటి రోజు పొలం దున్నేందుకు వచ్చి చూడగా గడానికి అమర్చిన రాయి కనిపించలేదు.చుట్టుపక్కల వెతికినా కనబడలేడు. కానీ మొదటి రోజు దొరికిన స్థానంలో రాయి ఉండడాన్ని రైతు గమనించాడు. దీంతో ఆ రాయిని యధావిధిగా తెప్పించి గడానికి అమర్చి పొలాన్ని దున్ని సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళాడు. రెండో రోజు అదే ఘటన జరిగింది.
రాయి కనబడకపోవడం వెతికిన దొరికిన చోటే ప్రత్యక్షమవడం రైతు కనిపించింది. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని రైతు భావించి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఈ పని ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని రైతు నిశ్చయించుకున్నాడు. ఇందుకు రాత్రి వేళలో నిద్ర పోకుండా అర్ధరాత్రి సమయంలో పొలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో గడానికి కట్టిన రాయి ఒక్కసారిగా తెల్లని దుస్తువులు ధరించిన దేవత రూపం దాల్చి వెంటనే తిరిగి రాయి రూపంలో మారి యధా స్థానికి చేరుకుంది. రైతు ఆ సన్నివేశాన్ని చూసి అమ్మవారు తనకు దర్శనం ఇవ్వడంతో తన జన్మ ధన్యమైందని సంతోషపడ్డాడు. ఈ విషయాన్ని గ్రామంలో వారందరికీ చెప్పగా ఎవరు నమ్మలేదు. అయినా పట్టువదలకుండా గ్రామస్తులను ఆ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అర్ధరాత్రి సమయంలో రాయి అమ్మవారి రూపాన్ని దాల్చడం ఆ తర్వాత నడుచుకుంటూ రాయిగా మారడాన్ని గ్రామస్తులు కూడా చూసి ఆశ్చర్యపోయారు. అమ్మవారి దర్శనం లభించడంతో గ్రామస్తులందరూ ధన్యులయ్యారు. ఆ వెంటనే రాయి రూపంలో అమ్మవారికి జమ్మి చెట్టు కింద ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది మాఘశుద్ద పౌర్ణమి నాటి నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దివిసీమగా పిలవబడుతున్న గుర్రం గడ్డ ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు ఆదిపరాశక్తి జమ్ములమ్మ ఉద్భవించిందని పూర్వీకుల కథనం ప్రచారంలో ఉంటుంది. గుర్రం గడ్డ నుంచి మాఘశుద్ధ పౌర్ణమికి ముందు రోజున అమ్మవారు జమ్మిచేడు గ్రామానికి వచ్చి అక్కడి గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు కింద దుష్టశక్తులను నుంచి ప్రజలను కాపాడేందుకు కొలువు దీరిందని చెబుతారు.
ఈ క్రమంలోని అమ్మవారు గ్రామ ప్రజలకు రాయి రూపంలో దర్శనమిస్తుందని అప్పటినుంచి ఇప్పటివరకు మాఘసిద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. నాటి కథనాల మేరకు ముందు రోజు అమ్మవారు ఉద్భవించిన గుర్రం గడ్డకు అమ్మవారిని తీసుకెళ్లి మళ్ళీ ఎద్దుల బండిమీద మెట్టినిల్లుగా పిలవబడుతున్న జమ్మిచేడుకు తీసుకువచ్చి ఉత్సవాలు జరుపుతూ వస్తున్నారు. అమ్మను కొలిస్తే తమకు అన్ని రకాల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 1983లో జూరాల ప్రాజెక్టు నిర్మాణం తర్వాత జమ్ములమ్మ వారి ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రిజర్వాయర్ గా మార్చడంతో ఆలయం లోతట్టుకు చేరుకుంది. ఆలయం అవతలి వైపు ఉన్న నీరు వెలుపలకి రావడం మొదలుపెట్టింది. దీంతో ఆలయం లోతట్టు ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన కొందరు సురక్షితమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడానికి తరలించాలని నిర్ణయించారు.
వెంటనే మూల విగ్రహాన్ని తొలగించేందుకు పనులు ప్రారంభించారు. విగ్రహాన్ని కదిపేందుకు దాదాపు పది అడుగుల లోతు మేర తొవ్వినాగాని మూల విగ్రహం ఏ మాత్రం కదలడం లేదు. అశుభం జరుగుతుందని భావించిన భక్తులు విగ్రహం వెలసిన చోటే ఉండాలని సూచించారు. అమ్మవారిని వేడుకోమని చెప్పారు. అప్పటి అధికారులు వెంటనే గుడిలోకి నీరు చేరకుండా ఉండేందుకు ఏర్పాట్లను చేయడంతో అన్ని సమస్యలు సర్దుకున్నాయి. 1983లో జరిగిన యదార్థ ఘటనను ఇక్కడి గ్రామస్తులు నేటికి చెబుతూ ఉంటారు. అమ్మవారి ఆలయం ముందు వెలసిన జంట నాగులను ముందుగా భక్తులు దర్శించుకుంటారు. అలాగే ముక్కిడి అమ్మగా పిలవబడే గ్రామ దేవతను కొలుస్తారు. జమ్ములమ్మకు ఎల్లవేళలా కాపలా ఉంటూ అమ్మను ముక్కిదమ్మ కాపాడుతుందని భక్తుల విశ్వాసం. ముక్కిదమ్మ విగ్రహాన్ని చెక్కతో తయారుచేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి నూతన విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
అమ్మను దర్శించుకునే కంటే ముందు నాగులమ్మను ముక్కిడమను దర్శించుకోవడం ద్వారా సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మ ఆలయం ముందు పరుశురాముడి ఆలయం ఉంది. పరుశురాముడిని కొలవడంతో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యంగా పొంగలని సమర్పిస్తారు. భక్తులు తమ పాడిపంటలు పొంగిపొర్లీల దీవించండి అమ్మ అని భక్తులు వేడుకుంటారు. నిమ్మకాయల మాలను, పూలమాలను అమ్మకు సమర్పించి కోళ్లను, మేకపోతులను అమ్మకు బలిగా సమర్పించుకుంటారు. వివిధ రకాల భక్తులు తమకు తోచిన రీతిలో జమ్ములమ్మ వారికి మొక్కులు చెల్లించుకుంటారు. నడిగడ్డ ప్రాంతంలో ఎలాంటి శుభకార్యాలు జరిగినా మొదటిగా జమ్ములమ్మ పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మకు మొదటి మొక్కు చెల్లించాకే కార్యక్రమాలను ప్రారంభించడం ఇక్కడ ప్రజల సంప్రదాయం. అమ్మను మొదటిగా కొలిస్తే ఇలాంటి విఘ్నాలు కలవకుండా చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadwal, Jogulamba gadwal, Local News