Naveen Kumar, News18, Nagarkurnool
నల్లమల అటవీ ప్రాంతంలో (Nallamala Forest) నివసించే ప్రత్యేకమైన ఆదివాసీ తెగకు చెందిన చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నడుం బిగించింది. అటవీ ప్రాంతంలో జీవిస్తూ అక్కడి అటవీ సంపదపైనే ఆధారపడిన చెంచుల జీవితాలు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అడవుల్లో చెంచులు ప్రధానంగా సేకరించే తేనె ఉత్పత్తులు క్రమక్రమంగా అడవిలో తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో ఉపాధి కోల్పోయే స్థితిలో ఉన్నటువంటి చెంచులు... అడవిలో వ్యవసాయం చేసేందుకు చెట్లు నరకడం, అటవీ శాఖ పరిధిలోని భూములను దున్నడం వంటి పనులు చేస్తున్నారు. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు అటవీ భూమిని సంరక్షించేందుకు అదేవిధంగా చెంచులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ప్రధానంగా తేన సేకరణతో జీవనాధారం పొందిన చెంచులకు కృత్రిమంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టి వాటి ద్వారా వచ్చే తేనెను విక్రయించి జీవనోపాధి పొందేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీటితో పాటు వాణిజ్య పంటలైన పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా అటవీ అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
నల్లమల అడవి ప్రాంతం అమ్రాబాద్ మండలంలోని బుస్సాపురం, బైరాపురం, రాంపురం, చెంచుపేటలో నివసిస్తున్న చెంచులకు తేనెటీగల బాక్సులను ఇటీవల ఫారెస్ట్ అధికారులు అందించారు. మరో రెండు గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమాలను అటవీ మొత్తం పరిధిలోని చెంచు పల్లెలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆదివాసి తెగకు చెందిన చెంచులు ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ పిల్లలకు విద్య , వైద్యం, పోషకాహారం వంటి అందించేందుకు దోహదం చేస్తున్నారు.
తేనెటీగలు ప్రధాన ఆహరంగా తీసుకొనే కుంకుడు, మామిడి, అల్లనేరేడు మొక్కలను కూడా అందించారు. ఈ మొక్కలకు చెందిన పూతనే ఆహారంగా తీసుకొని తేనెటీగలు అధికంగా తేనెను ఉత్పత్తి చేస్తుంటాయి. వీటితో పాటు పుట్టగొడుగుల సాగుపై కూడా అవగాహనలు కల్పించారు అధికారులు. చెంచులు ఆదాయాన్ని పెంచుకునేందుకు అమ్రాబాద్ మండలంలోని అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కామన్ బెస్ట్ ఎకో టూరిజం సెంటర్లో పుట్టగొడుగుల పెంపకంపై మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
మున్ననూరులోని పలు ప్రాంతాల్లో ఎలాంటి గాలి వెలుతురు నీరు లేకుండా ఉండేల డార్క్ రూములను ఏర్పాటు చేశారు. చిన్నపాటి సంచుల్లో కృత్రిమంగా పుట్టగొడుగులను పెంచడం మూడు వారాల పాటు ఇంక్యుబేషన్ లో ఉంచి వాటిని పరిరక్షించడం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Nallamala forest, Telangana