హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: జంగిల్ సఫారీకి మీరు సిద్ధమా.., నల్లమలలో టూర్ ప్యాకేజీలు ఇవే..!

Nagarkurnool: జంగిల్ సఫారీకి మీరు సిద్ధమా.., నల్లమలలో టూర్ ప్యాకేజీలు ఇవే..!

నల్లమలలో జంగిల్ సఫారీకి తెలంగాణ అటవీ శాఖ ఏర్పాట్లు

నల్లమలలో జంగిల్ సఫారీకి తెలంగాణ అటవీ శాఖ ఏర్పాట్లు

అడవులు, వైల్డ్ లైఫ్ ను ఇష్టపడేవారికి తెలంగాణ అటవీ శాఖ (Telangana Forest Department) ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు వారికి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  అడవుల గురించి చెప్పుకోవడమే తప్ప.. చాలా మంది లోపలికి వెళ్లరు. ఒంటరిగా లేక గుంపుగా వెళ్లాలంటే దారితప్పిపోతామనే భయంతో పాటు ప్రభుత్వ నిబంధనలు కూడా అడ్డొస్తుంటాయి. అడవులు, వైల్డ్ లైఫ్ ను ఇష్టపడేవారికి తెలంగాణ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అడవి జంతువుల సంరక్షణలో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు అడవిలోకి పర్యాటకులను అనుమతించలేదు. అయితే ఈ అక్టోబర్ నుంచి పర్యాటకులను అనుమతించేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా ప్యాకేజీలను ఏర్పాటు చేసి అడవిలో ఒకరోజు గడపాలి అనుకునే వారికి అన్ని విధాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఫారెస్ట్ స్టే ప్యాకేజీ పేరుతో రూ.1200 వరకు టికెట్ నిర్ణయించి అడవిలో తీసుకెళ్లి అడవి జంతువులు దగ్గర నుండి చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

  ఈ అక్టోబర్ మొదటివారం నుంచి ఈ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి అటవిశాఖ అధికారి రోహిత్ ప్యాకేజీల వివరాలను వెల్లడించారు. చిట్టడవి అందాలు, జలపాతాలు వంటి ప్రకృతి రమణీయమైన దృశ్యాలకు నిలయంగా నల్లమల ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఎన్నో ప్రకృతి అందాలు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. పచ్చని చెట్లు, ఎత్తైన గుట్టలు, రహదారి ఒంపు సొంపులు, కృష్ణమ్మ హొయల రూపాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

  ఇది చదవండి: జిల్లాలో మొట్టమొదటి సౌండ్ అండ్ లైటింగ్ సప్లయర్.., ఇప్పటికీ దసరా ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఆయనే 

  నల్లమలలో విహారానికి అటవీ శాఖ ప్రత్యేకంగా టూరిజం ప్యాకేజీలను నిర్వహిస్తుంది. ఫారెస్ట్ స్టే ప్యాకేజిలో భాగంగా ఒక రోజు నల్లమలలో గడిపే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చూడవలసిన ప్రాంతాలలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో మున్ననూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో మల్లెలతీర్థం జలపాతం ఉంది. ఎత్తైన గుట్టల నుంచి జాలువారే జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ - శ్రీశైలం రహదారిలో వటవర్లపల్లి నుంచి ఎడమవైపు ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి ఈ జలపాతానికి చేరుకోవచ్చు.

  ఇది చదవండి: అడవిలో సివంగులు: మావోయిస్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ 

  జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణా నదిలో విహారానికి లాంచ్ సౌకర్యం కూడా ఇటీవల పర్యాటకశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిలతో పాటు అమరగిరి, పెంట్లవెల్లి, మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలకు సైతం పర్యాటకుల తాకిడి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వు కోర్ ఏరియాలో జంగిల్ సఫారీ అవకాశం కల్పిస్తున్నారు అటవీశాఖ అధికారులు. పులుల సంతానోత్పత్తికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు అనువైన సమయం కాకపోవడంతో ఈ మూడు నెలలపాటు నల్లమలలో జంగిల్ సఫారీ నిలిపివేసారు.

  ఇది చదవండి: తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండాలనుకున్నాడు, కానీ కడుపుకోత మిగిల్చాడు

  ఈ నెల నుంచి సఫారీ తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్ శ్రీశైలం రహదారి పై ఉన్న ఫరహాబాద్ చెక్ పోస్ట్ నుంచి వ్యూ పాయింట్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర అడవిలో టైగర్ సఫారీ ఉంటుంది. ప్రత్యేక వాహనంలో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. వివిధ వణ్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. సఫారీ వాహనంలో పదిమంది వరకు కూర్చునే అవకాశం ఉండగా ఒక్కొక్కరికి రూ.1200 వరకు టికెట్ ఉంటుంది. ఇక 24 గంటల పాటు అడవిలో గడపాలనుకునే వారికి అటవీశాఖ ప్రత్యేకంగా టైగర్ స్టే ప్యాకేజీలను తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా జంగిల్ సఫారీ ట్రాకింగ్, కామన్ టెస్ట్ ఎకో టూరిజం, కాటేజీలో వసతి, ఐటీఆర్ పరిధిలో చేపడుతున్న సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో టైగర్ సఫారీకి అక్టోబర్ నుంచి అవకాశం కల్పిస్తున్నారు.

  ఏకో టూరిజంలో భాగంగా టైగర్స్ సంరక్షణ అవగాహన కల్పించేలా టూర్ ప్యాకేజీల రూపొందించామని నాగర్ కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ తెలిపారు. అడవిలో గడపాలనుకునే వారి కోసం తగిన ఏర్పాట్లను చేస్తున్నామని, సందర్శకులు అడవిలోకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దని, వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా టూర్ ఎంజాయ్ చేయాలనీ అధికారులు సూచించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagarkarnol district, Nallamala forest, Telangana

  ఉత్తమ కథలు