NAGAR KURNOOL FARMERS CELEBRATED THE ERUVAKA POURNAMI IN NAGARKURNOOL DISTRICT SNR NNK BRV
Farmers' Festival : సాగుకు సిద్ధమైన రైతన్నలు .. నాగర్కర్నూల్ జిల్లాలో ఏరువాక పౌర్ణమి సందడి
(ఏరువాక పౌర్ణమి)
Eruvaka Pournami: ఏరువాక పున్నమితో వ్యవసాయ పనులను మొదలు పెట్టే రైతులు, ఆ శుభపరిణామాన్ని ప్రకృతితో కలిసి జరుపుకునే పండుగే ఏరువాక పున్నమి. తెలుగు సంవత్సరంలో జేష్ట పౌర్ణమినాడు ఈ పండుగను నిర్వహిస్తారు. నాగర్కర్నూల్ జిల్లాలో అన్నదాతలు ఈపండుగను ఘనంగా జరుపుకున్నారు.
(N.Naveenkumar,News18,Nagarkurnool)
నాగరికత ఎంత ముందుకు సాగినా, సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా..అన్నదాతలు నాగలి పట్టనిదే ప్రపంచానికి ఆహారం అందదు. రైతులు దుక్కి దున్ని, పొలం సాగు చేసి ఆరుగాలం శ్రమిస్తేనే అందరికి ఆహారం లభిస్తుంది. అందరికి అన్నం పెట్టే రైతన్న, వ్యవసాయం కోసం వేసే తన మొదటి అడుగును ఎంతో సంబరంగా జరుపుకుంటాడు. అలా ఏరువాక పున్నమితో తన వ్యవసాయ పనులను మొదలు పెట్టే రైతులు, ఆ శుభపరిణామాన్ని ప్రకృతితో కలిసి జరుపుకునే పండుగే ఏరువాక పున్నమి(Eruvaka Pournami ). తెలుగు సంవత్సరంలో జేష్ట పౌర్ణమినాడు ఈ పండుగను నిర్వహిస్తారు. ఎండలు పూర్తిగా తగ్గిపోయి వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయంలో ఏరువాక (Eruvaka)పండుగను జరుపుతారు. నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool)లో ఏరువాక పండగను ఘనంగా నిర్వహించారు రైతులు.
ఏరువాక పున్నమి పండుగ నిర్వహణ:
ఏరువాక పున్నమి నాడు నాగలితో దుక్కి దున్నడంతో పొలం పనులు ప్రారంభిస్తారు రైతులు. నాగలి సారించి పనులు ప్రారంభించేందుకు జేష్ఠ నక్షత్రం మంచిదని పురోహితులు చెబుతుంటారు. ఈ నక్షత్రం చంద్రుడితో కూడి ఉండే రోజు కావడం ఎంతో విశిష్టతగా చెబుతారు. చంద్రుడు ఓషదాలకు అధిపతి. ఓషధాలు అనగా మంచు, ఎరుపు, సూక్ష్మ జంతువులని అర్థం. ఇవన్నీ ఉంటేనే వ్యవసాయం లాభాలను ఇస్తుందని రైతుల నమ్మకం. ఆరుగాలం కష్టించే రైతన్నకు తోడుగా, వారి కష్టాల్లో భాగం పంచుకుంటూ అండగా ఉండేవి పశువులు. అన్నదాతకు వ్యవసాయంలో ఉపయోగపడే ఎద్దులను ఏరువాక పౌర్ణమి రోజు ఉదయాన్నే చెరువులు, కుంటలు, బావుల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు, కుచ్చులు కట్టి ఎద్దులను అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నూతన వస్త్రాలతో అలంకరణ చేస్తారు. ఈ పండుగ సందర్భంగా పొంగలిని, బక్షాలను చేసి నైవేద్యంగా ఎద్దులకు సమర్పిస్తారు. ధూప దీపాలతో వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు. ఆ తరువాత పశువులను ఊరేగింపుగా తీసుకొచ్చి సంబరాలు చేస్తారు. నాగలికి ఎర్ర మట్టితో, సున్నంతో పట్టీలను అలంకరించి పొలం వద్దకు తీసుకెళతారు. ఈ ఏడాది కుటుంబంలో ఎవరి పేరు బలం ఉందో వారు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు.
ఏరువాక తాడు తెంచడం:
ఏరువాకనుపురస్కరించుకునిదుక్కి దున్నడానికి వెళ్లేముందు ఊరి పొలిమేరలో పుంటి నార, మావిడాకులతో తోరణాన్ని కడతారు. ఈ తోరణానికి డబ్బులు, జిలేబీలు, గారెలు, గజ్జెలు వంటి వాటిని కడతారు. అనంతరం ఆ తోరణాన్ని చర్నకోలతో కొడుతూ ఎవరికి దొరికిన వస్తువులు వారు తీసుకుంటారు. ఈ విధంగా చేయడం వలన పశువులకు మంచి జరుగుతుందని రైతులు భావిస్తారు. పశువులతో తోరణాన్ని తెంపిస్తారు. దీనినే ఏరువాక తాడు తెంపడం అంటారు. భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏరువాక పున్నమి నాడు ఆచరించే ఈ సంప్రదాయాన్ని, పండుగను విష్ణుపురాణంలో సీతా యజ్ఞంగా పిలువబడేది.
విత్తనాలు నాటడం ఆనవాయితీ:
ఏరువాక పండుగ రోజు రైతులు సాగుకు శ్రీకారం చుట్టి, పొలంలో విత్తనాలు నాటుతారు. అయితే సాగు భూములు లేనివాళ్లు కూడా ఏరువాకను ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతి సంస్కరణకు ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కనైనా నాటుతారు. ఇలా నాటడం ఎంతో శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.