Naveen Kumar, News18, Nagarkurnool
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయగా ప్రతి గ్రామ పంచాయతీకి ఈ నిధులు చేరాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి మౌలిక సదుపాయాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. అయితే ఈ నిధులు ఖర్చు చేయాలన్నా వినియోగించాలన్నా పంచాయతీ ఉద్యోగులకి పూర్తి అధికారాలు ఉంటాయి. వీటిని ఆసరాగా చేసుకున్న ఓ పంచాయతీ ఉద్యోగి అక్షరాల రూ.18,34,635 పంచాయతీ నిధులు కాజేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కంప్యూటర్ ఆపరేటర్ తన చేతివాటాన్ని చూపి నిధులను స్వాహా చేశాడు. కొల్లాపూర్ మండల పరిధిలోని 16 గ్రామపంచాయతీలకు ఈ నిధులు విడుదలయ్యాయి. నిధులను మండల పరిషత్ కార్యాలయంలోని ఈఓఆర్డి విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సునీల్ సింగ్ ఆయా గ్రామాల సర్పంచులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సొంత ఖాతాలోకి బదిలీ చేసుకున్న విషయాన్నికొందరు ప్రజాప్రతినిధులు బట్టబయలు చేశారు.
విషయం తెలుసుకున్న వివిధ గ్రామ సర్పంచులు కొల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి సమక్షంలో నిధులను పరిశీలించారు. కొల్లాపూర్ మండలంలోని బోరబండ తండా పంచాయతీకి చెందిన 35 వేల రూపాయలను వెల్లూరు గ్రామ పంచాయతీకి చెందిన నాలుగు రూ.1,50,300, చింతలపల్లి గ్రామపంచాయతీకి చెందిన రూ.1,39,950 జానాపల్లికి చెందిన రూ.33,088 రూపాయలను కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ సింగ్ తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు.
అంకిరావుపల్లికి చెందిన రూ.98,500 ఎనిమన్మెట్లకు చెందిన రూ.1,27,86 ముక్కిడి గుండం కు చెందిన రూ.45, 900 రామాపురం కు చెందిన రూ.97, 820 సింగోటంకు చెందిన రూ.13,000 మాచినేని పల్లికి చెందిన రూ.26,500 లచ్చనాయక్ తండాకు చెందిన రూ.74,500 కుడికిళ్లకు చెందిన మూడు రూ.70,000 మొత్తం కలిపి రూ.18,34,635 రూపాయలను సునీల్ సింగ్ తన సొంత ఖాతాలోకి బదిలీ చేసుకోవడంపై ఆ గ్రామాల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకొని సునీల్ సింగ్ను నిలదీశారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకొని నిధులను గ్రామపంచాయతీలకు ఇప్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
విచారణ చేపట్టిన అధికారులు నిధుల స్వాహా వెనుక ఎవరెవరి హస్తం ఉంది.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల పైన విచారణ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి పనులకు బిల్లులు రాక చాలామంది సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పనులు చేసినప్పటికీ బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా పూర్తిగా నష్టపోయామని ఆవేదనలో వ్యక్తం చేస్తూ పలు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే ప్రభుత్వం నిధులను మంజూరు చేసినప్పటికీ ఆ నిధులు గ్రామ సర్పంచులకు చేరకుండా ఇలాంటి ఉద్యోగులు చేసినటువంటి పనుల వల్ల సర్పంచులు మరింత నష్టపోతున్నారు. ఈ ఘటనలు పురావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana