Naveen Kumar, News18, Nagarkurnool
నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో ఇటీవల జరిగిన గర్భిణీల మరణాల సంఘటనలు చాలా కలకలం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్తలు సంచలనం కావడంతో వైద్య ఆరోగ్య శాఖ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గర్భిణీలకు అందుతున్న చికిత్సలు ఏ విధంగా ఉన్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది. దేని కారణంగా గర్భిణీలు, బాలింతలు చిన్నారులు మృతి చెందుతున్నారు అనే విషయాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు ఉదయ్ కుమార్ కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకటైన అచ్చంపేట నియోజకవర్గంలో ఇటీవల వైద్య అందక వంకేశ్వరానికి చెందిన గర్భిణి మృతి చెందిన సంఘటన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ఈ సంఘటన జరగడానికి కారణం ఏమిటి అనే అంశాలను విచారణ చేస్తున్నారు. గర్భిణి మృతి చెందిన సంఘటనలు మీడియా ద్వారా తెలుసుకున్న హైకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారణలు చేపడుతుంది. అయితే ప్రభుత్వ అధికారులు దీంతో అలర్ట్కావడంతో అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు అందుతున్నాయని అంశాలను తెలుసుకునేందుకు నేరుగా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రతి వార్డును కూడా పరిశీలించారు. ఆసుపత్రిని కలియతిరిగి అక్కడ ఉన్నటువంటి రోగులను, వారి బంధువులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
వైద్యం ఎలా అందుతుంది డాక్టర్లు ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయాలను నేరుగా రోగులతోనే అడిగి సమాచారాలను సేకరించారు. ఓపి రికార్డులను, ఆపరేషన్ థియేటర్లను అదేవిధంగా విధుల్లో ఎంతమంది సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్ ఎవరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే అంశాలను అడిగి విచారణ చేశారు. వీటితో పాటుగానే మొత్తం అచ్చంపేట ఆసుపత్రికి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి. వీటిలో ఇతర రోగాల వారు ఎంతమంది, గర్భిణీలు ఎంతమంది అనే సమాచారాన్ని సేకరించి ప్రసవాలు ఏ విధంగా చేస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంఘటనతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. వైద్యం సరిగా చేయనటువంటి డాక్టర్లకు వేటు తప్పదనే సంకేతాలు ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఎలాంటి అసౌకర్యాలు రోగులకు కలవకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana