రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోని రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి జడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. వీరిమధ్య మొదటి నుంచి కూడా సఖ్యత లేకపోవడం, ఎన్నికల సమీపిస్తుండడంతో ఈ విభేదాలు మరింత పెరిగాయి.
గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి జడ్పీ చైర్ పర్సన్ సరిత ఉత్సాహంగా ఉన్నట్టు ప్రచారం వినిపిస్తుంది. దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, సరిత ఏ కార్యక్రమానికి హాజరైనా కానీ ఏదో ఒక వివాదం చెలరేగుతుంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆ దిశగా జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారిక పరంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గంలో ఆమె హాజరవుతున్నారు.
బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశంలభిస్తే గెలువు సులభతరం అవుతుందన్న ఆశాభావంతో జడ్పీ చైర్పర్సన్ తన కార్యచరణను ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార పార్టీ నుంచి పోటీ చేసే మహిళలు ఎవరు లేకపోవడం, పైగా బీసీ సామాజిక వర్గం నుంచి కూడా అభ్యర్థులు పెద్దగా లేని కారణంగా అవకాశం కోసం సరిత, తిరుపతయ్య కీలక నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ కారణంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జడ్పీ చైర్మన్ సరితకు విభేదాలు తారస్థాయి చేరుకున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ హాస్టల్ ప్రారంభోత్సవాన్ని తాను వచ్చేలోపే జడ్పీ చైర్పర్సన్ తో ఎలా ప్రారంభంచేయించారంటూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఉన్నతాధికారిపై చేయి చేసుకునే ఎంత పని చేశారు.
తాజాగా మాల్డకల్ మండలంలోని ఓ కార్యక్రమంలో శిలాఫలకంపై జడ్పీ చైర్ పర్సన్ పేరు కనిపించకుండా బ్లాక్ స్టిక్కర్ తో మూసివేయడం సరితకు ఆగ్రహాన్ని తెప్పించింది. తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశాల్లోనూ జెడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న కారణంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమావేశాలకు పెద్దగా హాజరు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల భర్తీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మద్యం వ్యాపారికికట్టబెట్టడాన్ని కార్యకర్తలలో ఆగ్రహం తెప్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజాయితీగా పనిచేసిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వడంలేదని పలువురు నేతలు సామాజిక మాధ్యమంలో హల్చల్ చేశారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కాంట్రాక్టులను సైతం నియోజకవర్గంలోనే ముఖ్య నాయకుడి కన్ను సన్నుల్లో జరుగుతున్నాయని తమకు అవకాశం రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల మధ్య సఖ్యత కుదరకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదు అంటున్న అభిప్రాయాలు అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బిజెపి బలపడుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆదిపత్య పోరు తీవ్ర నష్టాన్ని కలిగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana