తెలంగాణ రాష్ట్రంలో డయాలసిస్ రోగులకు సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ డయాలసిస్ కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. డయాలసిస్ రోగులు ఈ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వచ్చి ఉచితంగా డయాలసిస్ సేవలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఒక నెలలో ఒక డయాలసిస్ రోగికి ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు చేయించుకునేందుకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు వస్తుంది.
అయితే ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తూ వస్తుంది. అయితే వీటితోపాటు డయాలసిస్ పేషంట్లకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేలా పాసులను కూడా అందించారు. అయితే నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డయాలసిస్ రోగులు జిల్లా కేంద్రానికి వచ్చి ఈ సేవలను వినియోగించుకోవాల్సి వచ్చేది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న కొల్లాపూర్,అచ్చంపేట, కల్వకుర్తి వంటి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రజలు 10 రోజులకోసారి జిల్లా కేంద్రానికి రావడం ఇబ్బందిగా మారేది.
అయితే ఈ పరిణామాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.కొల్లాపూర్ మండల పరిధిలోని రామాపురం రహదారిలో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సేవలు కిడ్నీ రోగులకు అందుబాటులోకి వచ్చాయి.
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో ఉన్న కిడ్నీ రోగులు డయాలసిస్ సేవల కోసం నాగర్ కర్నూల్ , హైదరాబాద్ , మహబూబ్నగర్, లాంటి ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుండేది. డయాలసిస్ చేసుకునే అవస్థల నుంచి ఇక తొలిగిపోయేందుకు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగానే రోజుకు పది మంది వరకు కిడ్నీ రోగులకు డయాలసిస్ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో కిడ్నీ రోగులు ఎదురుచూస్తున్న డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana