Home /News /telangana /

NAGAR KURNOOL CYBER CRIME IN WANAPARTHYTHE POLICE CAUGHT THE ACCUSED WITH TACT NNK BRV ABH

Nagarkurnool: ఆన్‌లైన్ షాపింగ్‌లో స్విఫ్ట్ కారు కూపన్ అంటూ నయా సైబర్ మోసం!..

నాగర్ కర్నూల్ క్రైమ్ న్యూస్

నాగర్ కర్నూల్ క్రైమ్ న్యూస్

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ వార్షికోత్సవంలో స్క్రాచ్ కార్డు వచ్చిందని, అందులో స్విఫ్ట్ కారు గెలుచుకున్నారంటూ ఓ అమాయకుడిని నమ్మించి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాళ్లు.

    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    సైబర్ క్రైమ్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దేశ వ్యాప్తంగా లక్షల్లో బాధితులు సైబర్ క్రైమ్ మోసాలకు బలైపోతున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ వార్షికోత్సవంలో స్క్రాచ్ కార్డు వచ్చిందని, అందులో స్విఫ్ట్ కారు గెలుచుకున్నారంటూ ఓ అమాయకుడిని నమ్మించి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 16న చోటుచేసుకోగా తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

    వనపర్తి పట్టణానికి చెందిన బోయ మద్దిలేటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 26న పోస్టల్ ద్వారా నాప్‌టోల్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ నుంచి మద్దిలేటికి కొరియర్ వచ్చింది. నాప్టాల్ 14వ వార్షికోత్సవం సందర్భంగా బెస్ట్ అవార్డు కింద ఒక గిఫ్ట్ వౌచర్, స్క్రాచ్ కార్డు ఆ కొరియర్‌లో వచ్చింది. దానిని స్క్రాచ్ చేసిన మద్దిలేటికి స్విఫ్ట్ డిజైర్ కారు గెలుచుకున్నట్లు చూపించింది. కారును స్వీకరించాలంటే అదే కవర్లో ఉన్నటువంటి ఓచర్లో బ్యాంకు వివరాలు, ఫోన్ నెంబర్‌తో అదే ఫామ్‌లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయాలనీ ఉండడంతో మద్దిలేటి వివరాలు పంపించాడు. అనంతరం మద్దిలేటితో ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు, కారు బదులు మీకు వెంటనే కావాలంటే క్యాష్ రూ.9,40,000 ఇస్తామని చెప్పారు. ఈ ఆఫర్ సరేనన్న మద్దిలేటి, వారు చెప్పినట్లుగా టీడీఎస్, జీఎస్టీ టాక్స్, ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం మూడు దఫాలుగా మొత్తం రూ. 97,350 గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. రోజులు గడుస్తున్నా వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన మద్దిలేటి, జులై 16న వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆన్ లైన్ మోసానికి పాల్పడిన ఆసిఫాబాద్‌కు చెందిన డి.కృష్ణమూర్తి, నరేందర్, శ్రీనివాస్, కొమరం భీమ్ జిల్లాకు చెందిన సుఖాంత్, నితీష్‌లను అరెస్ట్ చేశారు. వీరిలో కృష్ణమూర్తి, నరేందర్, శ్రీనివాసులపై గతంలో కూడా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు కోల్‌కతా నగరంలో ఒకకాల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని, అక్కడి నుండి వివిధ సెల్‌ఫోన్ సిమ్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని వివరించారు. రాచకొండ కమిషనరేట్, కరీంనగర్ టౌన్, నాగార్జునసాగర్ పరిధిలో మరికొందరు బాధితులు కూడా వీరి భారిన పడి మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి సెల్ ఫోన్లు, రూ. 92 వేల రూపాయల క్యాష్ రికవరీ చేశారు. ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఎటువంటి మెసేజ్‌లకు స్పందించవద్దని, అనుమానాస్పద వస్తువులను స్వీకరించవద్దని పోలీసులు సూచించారు.



    సైబర్ క్రైమ్ బాధితులు ఎవరైనా ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి డయల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. వనపర్తి ఎస్పీ ఆఫీస్ : పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం (SP కార్యాలయం), జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పంగల్ రోడ్, హనుమాన్ టెక్డి, మారెమ్మకుంట, వనపర్తి, తెలంగాణ 509103, ఫోన్ నెంబర్: 08545231100
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Nagar kurnool, Telangana

    తదుపరి వార్తలు