హోమ్ /వార్తలు /తెలంగాణ /

పగడ్బందిగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..

పగడ్బందిగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు..

X
ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారుల చర్యలు..

Telangana: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ ప్రిసైండింగ్ అధికారులు, మైక్రోఅబ్సర్వర్లు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ ఆదేశించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రోఅబ్సర్వర్లు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ ఆదేశించారు. మహబూబ్ నగర్ -రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, మైక్రోఅబ్సర్వ్ అధికారులకు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు నియమించబడిన పిఓ, ఏపిఓలు బ్యాలెట్ ద్వారా నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, ఇందుకుగాను ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా చదవాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులపై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, సహాయ ప్రిసైడింగ్ అధికారి సైతం అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా కారణం చేత ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు నిర్వహించలేనప్పుడు సహాయ ప్రిసైడింగ్అధికారి కూడా ఎన్నికలు నిర్వహించే విధంగా సంసిద్ధంగా ఉండాలన్నారు. రెగ్యులర్ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా నిర్వహించాలని, ముందుగా ఎన్నికల సందర్భంగా చేయవలసినవి, చేయకూడని అంశాలను బాగా తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గాను ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో 14 పోలింగ్ స్టేషన్స్ ఉండగా.. 1822 మంది ఓటర్లు ఉన్నారని.. ఇందులో పురుషులు 1169 మంది, మహిళలు 653 మంది ఓటర్లని తెలిపారు.ఏదైనా అంశం తెలియనట్లైనా, సందిగ్ధం ఉన్నట్లయితే ఎలాంటి సంకోచం లేకుండా ముందుగానే అలాంటి విషయాలను అడిగి తెలుసుకోవాలని, ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. 13వ తేదీ ఉదయం ఏడు గంటలకు అన్ని అంశాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సాయంత్రం నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నవారికి టోకెన్లు అందజేయాలని అన్నారు. ప్రతి అంశాన్ని ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

బ్యాలెట్ బాక్స్ సీల్ వేసే విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా అదనపు కలెక్టర్ ఎన్నికలు నిర్వహించే అధికారులకు వివరించారు. ఈ నెల 12వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి ఎన్నికల సామాగ్రిని అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాదులో ఎన్నికల సామాగ్రి అప్పగించాల్సి ఉంటుందన్నారు. ఏ విధమైన పొరపాట్లు లేకుండా సీలింగ్ విధానాన్ని నిర్వహించాలన్నారు.

టెండర్ ఓట్లు చాలెంజ్ ఓట్లపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్స్ గ్రీన్ సీల్ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రోఅబ్సర్వర్లతో పాటు వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. మైక్రోఅబ్సర్వర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మేధావుల ఎన్నికలు సులువుగా ఉన్నప్పటికీ అజాగ్రత్తతో ఉండకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్స్ రాజశేఖర్ రావు శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సూపరిండెంట్ రవి కిరణ్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు సంబంధిత అధికారులు, తదితరులు హాజరయ్యారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana