(N.Naveen Kumar,News18,Nagarkurnool)
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు (Telangana SI Constable Exams) సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఫిజికల్ పరీక్షలకు (Physical Tests) సిద్ధం అవుతున్నారు. ఈ అభ్యర్థుల కోసం నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులకు ఉచితంగా శిక్షణలు అందిస్తున్నారు. వీరిలో ఒకరు ఆబ్కారీ శాఖ నాగర్ కర్నూల్ (Nagar Kurnool) కు చెందిన సిఐ ఏడుకొండలు కాగా.. మరొకరు శ్రీపురం ప్రభుత్వ పాఠశాలలోని పీఈటి ఉపాధ్యాయురాలు డి. శుభాషిణి. ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పేద విద్యార్థులకు తమవంతు సహకారం అందిచాలనే ఉద్దేశ్యంతో ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణలు అందిస్తున్నారు.
రాత పరీక్షలకు సంబంధించిన తరగతులను సీఐ ఏడుకొండలు అందిస్తుండగా ఫిజికల్ టెస్ట్ లకు సంబంధించి పీఈటి శుభాషిణి శిక్షణలు అందిస్తున్నారు. ఈ ఇద్దరూ ఉద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అనే అంశాలను సూచనలను న్యూస్ 18 ద్వారా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో వివరించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారు ముందు తమపై తమకు నమ్మకంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలని సీఐ ఏడుకొండలు సూచించారు.
అనవసరమైన విషయాలు, సామాజిక మాధ్యమాలు, సినిమాలకు, జల్సాలకు కాస్త దూరంగా ఉంటూ లక్ష్యాన్ని సాధించాలనే తపన కలిగి ఉండాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకం చాలా వరకు తగ్గించాలని చెప్పారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రెలీమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. దీని తరువాత మెయిన్స్ పరీక్ష కోసం కఠోర శ్రమ అవసరమని తెలిపారు ఏడుకొండలు.
'' పరీక్షల చివరి వరకు శ్రమిస్తూనే ఉండాలి. ఎక్కడ కూడా క్రమ పద్ధతి తప్పకుండా ఉండాలి. కరెంట్ అఫైర్స్‌పై ప్రధాన దృష్టి సారించాలి. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. ఫిజికల్ టెస్ట్‌లో పురుషులకు 1600, స్త్రీలకు 800, మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ వంటి టెస్ట్ లు ఉంటాయి. నేను శిక్షణ ఇస్తున్న వారిలో చాలా వరకు గ్రౌండ్ అలవాటు లేని వారు ఎక్కువగా ఉన్నారు.'' అని పీఈటి శుభాషిణి తెలిపారు.
ఫిజికల్ టెస్ట్‌లో పాస్ అవ్వడానికి ఫిట్నెస్ చాలా అవసరమని సూచించారు. నానబెట్టిన ధాన్యం గింజలు,గుడ్లు, పాలు తీసుకోవాలని చెప్పారు. రెగ్యులర్‌గా ప్రాక్టీసు చేస్తే ఫిజికల్ టెస్ట్ పాస్ కావడం చాలా సులభమని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Local News, Nagar kurnool, Telangana