Naveen Kumar, News18, Nagarkurnool
ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సామూహిక కల్యాణ మహోత్సవంలో వివాహం చేసుకునే వధువరులకు, వారి తల్లిదండ్రులకు ట్రస్ట్ ద్వారా పట్టువస్త్రాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (MLA Marri Janardhan Reddy) పంపిణీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలోని తేజా కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదోసారి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న సామూహిక వివాహ మహోత్సవంలో వివాహం చేసుకునే నూతన వధువరులకు, వారి తల్లిదండ్రులకు పట్టువస్త్రాలను అందజేసారు. ఈ ఏడాది సామూహిక వివాహ మహోత్సవంలో 220 పైగా జంటలకు వివాహాలు చేస్తున్నారు. ఈ జంటలకు వివాహ సమయంలో అవసరమయ్యే పట్టు చీరలను, పట్టు పంచలను వధువరులతో పాటు వారి తల్లిదండ్రులకు అందించారు.
పెళ్లి బట్టలతో పాటు తలంబ్రాల బట్టలను కూడా అందించారు. ఈ వివాహ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా కేంద్రంలోని జడ్పి గ్రౌండ్ లో భారీ సెట్టింగ్ ఏర్పాట్లు చేసారు. 900 ఫీట్లతో పెళ్లి పందిరి ఏర్పాటు చేసి.. ఒక్కో జంట దగ్గర 10 మంది వరకు కూర్చొనే విధంగా సదుపాయాలు చేశారు. పెళ్లికి వచ్చిన బంధు మిత్రులందరికీ విందు భోజనం కూడా ఏర్పాటు చేసారు. అన్ని మతాలను గౌరవిస్తూ ముస్లిం, క్రిస్టియన్ మతస్థులకు వారి వారి సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరిపిస్తున్నారు. ప్రతి ఏటా కూడా జరిపిస్తున్న ఈ సామూహిక వివాహాలకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి ఖర్చులు భరించలేని పేదరికంలో ఉన్నటువంటి ఈ సామూహిక వివాహాల ద్వారా తమ బిడ్డలకు వివాహం జరిపించి బాధ్యతలు నిర్వహించుకుంటున్నారు.
ఒకే వేదికపై 225 జంటలు ఒకే ముహూర్తానికి ఒకటి కావడం ఒక అద్భుతమైన ఘటన ఈ పెళ్లిలను చూసేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తరలివస్తారు. కనుల పండుగగా కొనసాగే పెళ్లి వేడుకలను చూసి తరిస్తారు. కొత్త జంటలను దీవిస్తారు. అయితే దాదాపుగా 20 నుంచి 25 వేల మంది వరకు ఈ వివాహ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఇందుకు తగినట్టుగా భారీగా ఏర్పాట్లను చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఈ వివాహాలకు ఏర్పాటు చేయనున్నారు. వాహనదారులకు, అదేవిధంగా పెళ్లిళ్లకు వచ్చిన వారికి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana