Naveen Kumar, News18, Nagarkurnool
ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ఉపాధి అవకాశాలను చాలావరకు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రైవేట్ ఉద్యోగుల కోసం ఇతర రకాల ఇండస్ట్రీలను తీసుకురావడం, పెట్టుబడులను పెంచడం వ్యాపారవేతలను ఆహ్వానించడం వంటి చర్యలు చేపడుతూనే ప్రభుత్వ పరిధిలో పర్మినెంట్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తుంది. అత్యవసర పరిస్థితిలో ప్రజలకు సేవలు అందించేందుకు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తూ ఉంటుంది. అయితే వీటిని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు కాసులు ఇస్తేనే ఉద్యోగం ఇస్తానంటూ కాంటాక్ట్ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారు. 40 వేల నుంచిలక్ష రూపాయల వరకు వసూలు చేస్తూ నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భర్తీ చేసేందుకుభేరసారాలు పెట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwala District) ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పోస్టులను డబ్బులకు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న వారే తమ కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ పోస్టులను డబ్బులు తీసుకొని భర్తీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరోవైపు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు వారి ప్రైవేట్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను తరలించేందుకు తెలిసిన వారిని కాంట్రాక్టు ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారని సమాచారం. కాంట్రాక్ట్ పోస్టులను డబ్బులకు అమ్ముకోవడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను తన ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చేలా చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కాంట్రాక్టర్ సిబ్బందిలో ఏడుగురిని నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరో డాక్టర్ కూడా అలాగే ఒక వ్యక్తిని నియమించుకున్నారని తెలుస్తుంది. వీరు తమ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని ఇక్కడ నియమించుకొని సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాలు తెలిసిన జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందించడం లేదని నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ప్రస్తుతం 43 మంది శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. వీరిలో స్వీపర్లు 23 మంది పేషెంట్ కేర్ ప్రొవైడర్లు 10మంది సెక్యూరిటీ గార్లు 12 మంది సూపర్వైజర్లు నలుగురు ఉన్నారు. వారిలో ఎక్కువగా వారి వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. స్వీపర్ పోస్ట్ కు 40 వేల రూపాయలు, పేషెంట్ కేర్ ప్రొవైడర్ పోస్టుకు 80 వేల నుంచి లక్ష దాకా తీసుకొని పోస్టులు ఇచ్చినట్లుగా తెలుస్తుది. రెండు రోజుల క్రితం ఒక డాక్టర్ ఒక సిబ్బంది రెండు స్వీపర్పోస్టులను, ఒక పేషంట్ కేర్ ప్రొవైడ్ పోస్టును డబ్బులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంట్రాక్ట్ పోస్ట్ అమ్ముకోవడంపై కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. తనకు ఉద్యోగం రాలేదని ఓ మహిళ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి ఆరు నెలల చిన్న పాప ఉన్నా.. మూడు నెలలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశానని.. ఆసుపత్రిలో పోస్టులు ఉంటే మొదటి ప్రాధాన్యత తమకే ఇస్తామని అప్పుడు చెప్పిన అధికారులు.. ఇప్పుడు కాసులకు కక్కుర్తి పడి వాటిని అమ్ముకున్నారని జమ్ముచేడుకు చెందిన శివమ్మ కలెక్టర్ వల్లూరు క్రాంతికి శనివారం ఫిర్యాదు చేశారు. పేషంట్ కేర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రజాప్రతినిధుల నుంచి లెటర్ తేవాలని వైద్యాధికారులు చెప్పారని అవి తెచ్చినా, ఇతరులకు అమ్ముకుంటున్నారని కలెక్టర్ వద్ద వాపోయారు. తనకు ఇస్తానన్న ఉద్యోగం ఇవ్వకుంటే ఆసుపత్రి ముందు ధర్నా చేస్తానని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం నియమించిన పోస్టుల్లో ఇద్దరిని ప్రజాప్రతినిధులు రికమెండ్ చేసిన వారికి ఉద్యోగం రాలేదని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఆసుపత్రి సిబ్బందిని సూపరిండెంట్ ను ప్రశ్నించగా అలాంటి అవకతవకలు ఏమి జరగలేదు అన్నట్టుగా చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jogulamba gadwal, Local News, Nagarkurnool, Telangana