(N. Naveen Kumar, News 18, NagarKurnool)
ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)లో ప్రసవం (Delivery) అంటే భయపడే పరిస్థితులు ఉండేవి. ఆసుపత్రిలో వసతుల లేమి, సిబ్బంది ప్రవర్తన, ఇతరత్రా అంశాలు వలన ప్రభుత్వాసుపత్రి అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అంటే..ఒక ప్రహసనంగా భావించేవారు. అటువంటి ప్రతికూల భావం తప్పించి.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ సాధారణ ప్రసవాలు జరుగుతాయని ప్రజల్లో బలమైన విశ్వాసం ఏర్పడింది. అందుకు ప్రభుత్వం, వైద్యాధికారులు తీసుకున్న నిర్ణయాలే కారణంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గర్భిణీలకు కేసిఆర్ కిట్ (KCR Kit)తో పాటు వైద్య పరీక్షలు, చికిత్సలు, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు సాధారణ ప్రసవాలు ప్రోత్సహిస్తూ.. వైద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు సంఖ్య పెరుగుతోంది.
నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో 2016 నుంచి 2022 ఆగస్టు వరకు మొత్తం 61,251 కాన్పులు జరిగాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు (Normal weaning) 2,286 జరగ్గా, 12,386 సిజేరియన్లు జరిగాయి. అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు కేవలం 5,806 జరిగితే 20,253 సిజేరియన్లు జరిగాయి. ఇలా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం సాధారణ కాన్పులు 28,612, సిజేరియన్లు 32,639 జరిగాయి. ప్రభుత్వ దవాఖానాల్లో 2016లో 1,153 సాధారణ కాన్పులు నమోదు కాగా 2020లో అత్యధికంగా 4,098 కాన్పులు జరిగాయి. ఇక ఈఏడాది ఆగస్టు రెండో వారం నాటికి 2,261 కాన్పులు జరగడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం సిజేరియన్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైద్యశాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో ప్రభుత్వ దావకానాల్లో సాధారణ ప్రసవాలతో సమానంగా ప్రైవేటు దావకానాల్లో 20,253 సిజేరియన్లు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
.మగపిల్లాడు పుడితే రూ.12,000 ఆడపిల్ల పుడితే రూ.13,000..
మాతాశిశు మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించడంతోపాటు పీహెచ్సీలో 24 గంటల సేవలు అందిస్తుంది. జిల్లా ఏరియా కమ్యూనిటీ ఆసుపత్రులతో పాటు పిఎసిలో కాన్పులు చేసేలా చర్యలు తీసుకుంటుంది. మాతశిశు మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వ దావకానాల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు జరిపితే కేసిఆర్ కిట్ అందిస్తుంది. మగపిల్లాడు పుడితే రూ.12,000 ఆడపిల్ల పుడితే రూ.13,000 ఇస్తుంది. ఈ పథకాల అమలుతో కాన్పుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. పేదలతో పాటు ధనికులు సైతం సర్కార్ దవాఖానకు ప్రాధాన్యత ఇస్తుండడం కొసమెరుపు.
ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్ చేయడం కోసం రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో ఆసుపత్రులపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఉచితంగా నమ్మకంతో కూడిన ప్రభుత్వ దవాఖానాల్లో కాన్పులు చేయించుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రిలో సాధారణ కాన్పులు పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహకాలు అమలు చేస్తుంది. కాన్పులు చేసే వైద్య సిబ్బందికి రూ. 3000 నగదు కూడా అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆగష్టు 4న వైద్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం అందించే రూ.3000లో రూ.1000 డాక్టర్లకు, రూ.1000 స్టాఫ్ నర్సుకు, శానిటరీ వర్కర్లకు రూ. 500 చొప్పున ఇవ్వనున్నారు.
ఇందులో సబ్ సెంటర్లోని ఏఎన్ఎంలకు రూ. 250, ఆశా వర్కర్లకు రూ.250 చొప్పున ఇస్తారు. ఆసుపత్రులకు కేటాయించిన 80% సాధారణ కాన్పుల లక్ష్యాన్ని చేరుకుంటేనే ఈ ప్రోత్సాహం అందేలా నిబంధనలు విధించారు. ప్రతి నెలలో జరిగిన కాన్పుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటూ మార్గదర్శకాలను విడుదల చేశారు. దీని ప్రకారం మెడికల్ కళాశాల అనుబంధం దవాఖానాల్లో ప్రతి నెల 350 సాధారణ కాన్పులు, జిల్లా ఆసుపత్రిలో 250, ఏరియా ఆసుపత్రిలో 150, పీహెచ్సిలో 50, 24 గంటల పీహెచ్సిలో 10, ప్రైమరీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో 5 కాన్పులు చేయాల్సి ఉంటుంది. ఇలా 80 శాతం చేరుకుంటేనే రూ.3000 నగదు ప్రోత్సాహం అందుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు: సుధాకర్ లాల్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్ ఫోన్: 9440489057
సిజేరియన్ (Cesarean) వలన భవిష్యత్తులో మహిళలు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని నాగర్‌కర్నూల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అంటున్నారు. ఇలాంటి పరిణామాలు సంభవించకుండా సాధారణ ప్రసవాలు జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందులో భాగంగానే కాన్పులు చేసే వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ ప్రసవాలు చేస్తే రూ.3000 వైద్య సిబ్బందికి అందిస్తారని, అంతే కాకుండా ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ సుధాకర్ లాల్ వివరించారు.
జిల్లా ఆసుపత్రి, నాగర్ కర్నూల్, 08540225277.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hospitals, Local News, Nagarkurnool