రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
ఆడపిల్ల పుట్టిందని భార్యలను వేధిస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల పుడితే కాపురానికి రావద్దు అంటూ వెళ్ళగొట్టే సంఘటనలు రోజు ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసి తనకు వివాహం అయిందనే విషయాన్ని దాచి పెట్టి యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని ఆమెను విడిచిపెట్టిన సంఘటన అందరినీ కలిచివేస్తుంది. తన భర్త తనతో కలిసి ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ భార్య భర్త ఇంటి ముందే ఆందోళన చేపట్టింది. ఈ విషయం గ్రామస్తుల పెద్దలకు తెలియడంతో పంచాయతీలు పెట్టి యువతకి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం చాకలి పల్లిలో బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. చాకలిపల్లికి చెందిన శేఖర్ నాగులమ్మ తాండాకు చెందిన కవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనకు గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఉంటే ఈ విషయం అందరికీ తెలుస్తుందని ఉద్దేశంతో హైదరాబాద్ లోని నవాబ్పేట ఏరియాలో కాపురం పెట్టారు. కొన్నాళ్లు సాఫీగానే సాగినటువంటి వీళ్ళ కాపురంలో కూతురు పుట్టిన తర్వాత శేఖర్లో చాలావరకు మార్పులు చోటు చేసుకున్నాయి. బాబు కావాలని గతంలో గర్భస్రావం చేయించిన శేఖర్ ఆ తరువాత కాన్పులో కూడా మళ్లీ కూతురే పుట్టడంతో మూడోసారి పుట్టిన ఆడబిడ్డ తనకొద్దు అంటూ వదిలించుకునే ప్రయత్నం చేశారు.
గతంలో తరచూ గొడవలు అవుతున్న క్రమంలో కవిత ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలిపి పంచాయతీ పెట్టి ఆమె భద్రత కోసం 30 గుంటల భూమిని ఆమె పేరు పైన చేయాలని గ్రామ పెద్దలు పంచాయతీ తీర్పును ఇచ్చారు. ఇందులో 20 గుంటల భూమిని ఒప్పందం చేసుకున్నటువంటి శేఖర్ ఇప్పటివరకు ఆ భూమిపైన సంబంధించి పత్రాలు సంతకం చేయకుండా వేధిస్తున్నారు. ఇటీవల మళ్ళీ పంచాయతీ పెట్టి కవిత పేరుపై భూమి పట్టా చేయాలని గ్రామ పెద్దలు చెప్పారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన వెంటనే శేఖర్ ఆమెను వదిలి సొంత ఊరికి చేరుకున్నారు. పిల్లలను వదిలేసి వస్తేనే తనతో కాపురం చేయనిస్తానంటూ చెప్పారు. దీంతో ఏం చేయాలో కవిత భర్త ఇంటిముందే ధర్నాకు దిగింది. తనను తన పిల్లలను న్యాయం చేయాలని గ్రామస్తులను కోరుతుంది. ఈ విషయం అధికారుల దృష్టికి తెలియడంతో శేఖర్ కు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Local News, Nagar kurnool, Telangana