(బాలకృష్ణ, న్యూస్18 తెలుగు, హైదరాబాద్)
సాధారణంగా కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభం కాగానే చికెన్ (Chicken Price) , మటన్ ధరలు (Mutton Rate) అమాంతం పడిపోతాయి. హిందువుల్లో చాలా మంది పూజలు, ఉపవాసాలు ఉండడం వల్ల.. మాంసాహారం జోలికి వెళ్లరు. తద్వారా డిమాండ్ తగ్గి.. రేట్లు కూడా పడిపోతుంటాయి. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అనూహ్యంగా కార్తీక మాసం ప్రారంభమయ్యాక.. మాంసం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో కిలో మటన్ ధర వెయ్యి రూపాయిల మార్క్ దాటింది. సాధారణ రోజుల్లో కిలో మటన్ రూ.700-800 ఉంటుంది. అయితే ఈ సారి కార్తీక మాసం ప్రారంభం అయినప్పటి నుంచి చికెన్, మటన్ ధరల్లో మార్పులు ఏ మాత్రం రాకపోవడం విచిత్రం. ధరలు తగ్గకపోగ.. ఎప్పుడూ లేని విధంగా మరింత పెరుగుతున్నాయి.
నగరంలో మటన్‌కు డిమాండ్ అమాంతం పెరిగిందని మాంస వ్యాపారులు చెబుతున్నారు. సరఫరా లో కొరత కారణంగా మటన్ ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావంతో అల్లాడుతున్న సామాన్యులకు... ఇప్పుడు మరింత ఇబ్బందులు మొదలయ్యాయి. కార్తీక మాసంలోనే ఈ స్థాయిలో రేట్లు ఉంటే.. పూజలు ముగిశాఖ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 23న కార్తీక మాసం ముగుస్తుంది. ఆ తర్వాత చికెన్, మటన్‌కు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మటన్ ధర రూ.1300 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
“ఇప్పుడే ఇలా ఉంటే కార్తీక మాసం ముగిసిన తర్వాత భారీ డిమాండ్ ఉండొచ్చు. ఈ నెల 23 తో కార్తీక మాసం ముగుస్తున్న నేపథ్యంలో అప్పుడు మటన్ ధరలు ప్రస్తుతం ఉన్న 1000 నుంచి 1300 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. '' అని మటన్ వ్యాపారస్తుడు ఇమ్రాన్ న్యూస్ 18 కి తెలిపారు.
గత ఏడాది ఇదే సమయానికి మటన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. చికెన్‌తో పాటు మటన్ ధరలు కూడా దిగొచ్చాయి. మటన్ కిలో రూ.500 నుంచి రూ.550 వరకు పలికింది. ఇప్పుడు మాత్రం ఆ ధరలు రెట్టింపు అయ్యాయి చెబుతున్నారు మటన్ వ్యాపారస్తులు. మొత్తానికి ఈ ఏడాది కార్తీక మాసం కూడా నాన్ వెజ్ ప్రియులను పెద్దగా కట్టడి చేయలేకపోయింది. కార్తీక మాసంతో పని లేకుండా మాంసం ప్రియులు చికెన్, మటన్‌ను లాగించేస్తున్నారు. అందువల్లే రేట్లు తగ్గకపోగా.. ఇంకా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి మేకలు, గొర్రెల కొరత కూడా ఒక కారణమని.. వీటి సరఫరా పెరిగితే.. మటన్ ధరలు కొంత మేర తగ్గే సూచనలు ఉన్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.