తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికల (Munugodu Bypoll) వేడి పెరుగుతోంది. ఎవరికి వారు వ్యూహాల్లో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు కావాల్సింది. సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారు? ఎప్పుడు ప్రకటిస్తారు? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ప్రగతి భవన్లో ఉమ్మడి నల్లొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ (CM KCR) సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుససరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. అక్టోబరులో ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని.. నవంబరులోనే ఎన్నికలు జరగవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఎన్నికలు నేడో రేపో అన్నట్లుగా అందరూ కలిసి పనిచేసి.. పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు.
KCR: మునుగోడుపై తేల్చేసిన కేసీఆర్ .. ఆ తరువాతే అభ్యర్థి ప్రకటన ?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopalreddy) తమ పార్టీలో చేర్చుకొని ఉప ఎన్నికను ప్రోత్సహించిన బీజేపీ .. ఇప్పుడు భయపడుతోందని తమ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్కే పట్టం గట్టాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని.. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఐనప్పటికీ నేతలు తేలిగ్గా తీసుకోవద్దని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా సంక్షేమ పథకాలనే నమ్ముకున్న సీఎం కేసీఆర్.. వాటిపైనే ఎక్కువగా ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. దళితబంధు (Dalitha Bandhu Scheme)పై ఊరూరా ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
దసరాకు ముందే మహిళలకు పండుగ కానుక..రెండ్రోజుల్లో బతుకమ్మ చీరల పంపిణి
దళిత బంధు పథకం కోసం మునుగోడులో 500 మందిని ఎంపిక చేయాలని అక్కడి నేతలకు సీఎం కేసీఆర్ చెప్పారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ త్వరలోనే జీవో ఇవ్వనున్నామని.. గిరిజన బంధును కూడా ప్రారంభించబోతున్నామని.. వీటిపై మునుగోడులో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గిరిజనుల ఇంటింటికీ తిరిగి వీటిపై ప్రచారం చేయాలని చెప్పారు. మునుగోడులోని గిరిజనులను రోజుకో 1000 మందిని హైదరాబాద్ తీసుకొచ్చి బంజారా, ఆదివాసీ భవన్లను చూపంచానలి.. అక్కడ చక్కటి ఆతిథ్యమిచ్చి పంపించాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు. కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంగా ఒక పండగలా జరగాలని.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించారు.
పార్టీ శ్రేణులుకలిసి కట్టుగా పనిచేసి.. టీఆర్ఎస్ విజయం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. ఉమ్మడి నల్గొండ నేతలు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక చండూరులో బహిరంగ సభను నిర్వహిద్దామన్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ రవీందర్రావు, పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఐతే టీఆర్ఎస్ పార్టీ కూసుకుంట్లకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. చండూరులో సభ నిర్వహిద్దామన్న కేసీఆర్.. ఆ సభ వేదికగానే అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Munugode Bypoll, Munugodu By Election, Telangana