మునుగోడు ఉపఎన్నికల ఫలితం (Munugode Bypolls) ఉత్కంఠ రేపుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితం మారుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య విజయం దోబూచులాడుతోంది. మొదటి రౌండ్లో టీఆర్ఎస్కి ఆధిక్యం వస్తే.. రెండు,మూడు రౌండ్లలో బీజేపీ దూకుడు ప్రదర్శించింది. నాలుగో రౌండ్లో మాత్రం మళ్లీ టీఆర్ఎస్ లీడ్‌లోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసిన తర్వాత టీఆర్ఎస్కి 26,443 ఓట్లు, బీజేపీకి 25,729 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 7,380 ఓట్లు వచ్చాయి. నాలుగు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఐదో రౌండ్ కీలకం కానుంది. సంస్థాన్ నారాయణపూర్ మండలంలో గ్రామీణ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టికి కలిసి వస్తుంది. ఒకవేళ బీజేపీకి ఎక్కువ ఓట్లు పడితే.. మళ్లీ హోరాహోరీ నెలకొనే అవకాశముంది.
మునుగోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. ఇందులో 2,25,192 మంది ఓటు వేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు.
చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లిలో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి.
పోలింగ్ ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 1, 2, 3, 4 రౌండ్లు, సంస్థాన్ నారాయణపురం ఓట్ల కౌంటింగ్ 4, 5, 6 రౌండ్లలో చేస్తారు. ఇక మునుగోడు ఓట్ల కౌంటింగ్ 6, 7, 8 రౌండ్లు, చండూరు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 8, 9, 10 రౌండ్లు, గట్టుప్పల్ మండలం ఓట్ల కౌంటింగ్ 10, 11 రౌండ్లలో నిర్వహిస్తారు. మర్రిగూడ మండలం ఓట్ల కౌంటింగ్ 11, 12, 13 రౌండ్లు, నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 13, 14, 15 రౌండ్లలో జరుగుతుంది.
మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఐతే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యే నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Komatireddy rajagopal reddy, Munugode, Munugodu, Munugodu By Election