మునుగోడు ఉపఎన్నికలు (Munugode Bypolls) తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. మూడు పార్టీలూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. ఐతే మునుగోడు ఉపఎన్నికల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎటు వైపు ఉంటారు? ఆయన వ్యవహారంపై రోజుకో చర్చ.. కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ (Komatireddy Venkat Reddy) గెలుపు కోసం కృషి చేస్తారా? లేదంటే తమ్ముడికే జైకొడతారా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)నే గెలిపించాలని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.
బుధవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఎంపీటీసీ సభ్యురాలు పోలగోని విజయలక్ష్మి భర్త సైదులు సంచలన ఆరోపణలు చేశారు. తన తమ్ముడినే గెలిపించాలని.. వెంకటరెడ్డి పదే పదే వాట్సప్ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మండలంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలకు ఆయన ఫోన్ చేస్తున్నారని.. కానీ బయటికి చెప్పేందుకు వారు ధైర్యం చేయడం లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు వెంకటరెడ్డిని కూడా టార్గెట్ చేశారు. మునుగోడులో జరిగిన ఓ సభలో అద్దంకి దయాకర్ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉంటే ఉండు..లేదంటే వెళ్లిపో.. అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత దయాకర్‌తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా క్షమాపణలు చెప్పారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని లేదంటే.. ప్రచారానికి రాబోనని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రియాంక గాంధీతో సమావేశం తర్వాత.. ఆయనలో కొంత మార్పు వచ్చింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న వెంకటరెడ్డి.. మునుగోడులో ప్రచారానికి రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మునుగోడు ఉపఎన్నికలపై పార్టీ నిర్వహించిన సమావేశాలకు కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఆయన వ్యవహార శైలిపై పార్టీలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy rajagopal reddy, Komatireddy venkat reddy, Munugode Bypoll, Telangana Politics