మునుగోడు ఉపఎన్నికల్లో (Munugode Bypoll) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) కాకుండా.. ఆ పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) నామినేషన్ వేశారు. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం.. అనూహ్యంగా చండూరులోని ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) తరపున గద్దర్ నామినేషన్ వేయాల్సి ఉన్నా.. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల.. తాను నామినేషన్ వేయాల్సి వచ్చిందని తెలిపారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కోరుకునే ప్రజలంతా.. ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే.. మునోగుడును అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు కేఏ పాల్.
''ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ నామినేషన్ వేస్తారని తెలిశాక టీఆర్ఎస్ , బీజేపీ , కాంగ్రెస్‌కు నిద్రపట్టలేదు. గద్దర్ అన్న నామినేషన్ వేయకుండా ఆపారు. అందుకే నేను నామినేషన్ వేశాను. ఎన్నికల గుర్తును 17వ తేదీన ప్రకటిస్తాం. కేఏ పాలే నామనేషన్ వేశారంటే.. మునుగోడు అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందన్న ఉద్దేశంతో.. పలువురు ఇండిపెండెంట్లు పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరూ మరో 100 మందికి చెప్పి ఓటు వేయించాలి. అందరం కలిసి మునుగోడును అభివృద్ధి చేసుకుందాం. బీసీలు, దళితులు ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయాలి.'' అని కేఏ పాల్ అన్నారు.
కాగా, అక్టోబరు 5న దసరా సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన పేరును కేఏ పాల్ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు గద్దర్‌కి, కేఏ పాల్కి కనెక్షన్ ఎక్కడ కుదిరిందని, గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరడమేంటని చాలా మంది చర్చించుకున్నారు. కానీ పార్టీలో చేరిన 10 రోజులకే కేఏ పాల్‌కు షాకిచ్చారు గద్దర్. గడువు ముగుస్తున్నా.. ఆయన నామినేషన్ వేయడానికి రాలేదు. కేఏ పాల్‌కు కూడా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ తరపున తానే నామినేషన్ వేశారు కేఏ పాల్.
ఐతే గద్దర్ ఎందుకు నామినేషన్ వేయాలేదన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో ఉన్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరేమో కావాలనే నామినేషన్ వేయలేదని అంటున్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరి కొన్ని రోజుల తర్వాత.. ఆయన తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌ని కలిశారు. అనంతరం మరికొందరు నేతలు, శ్రేయోభిలాషులు కూడా గద్దర్‌కు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ పరిణామల నేపథ్యంలోనే ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ నామినేషన్ వేయలేదని సమాచారం. ఐతే ఆయనకు బెదిరింపులు రావడం వల్లే నామినేషన్ వేయలేకపోయారని కేఏ పాల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gaddar, Ka paul, Munugode Bypoll, Munugodu By Election, Telangana