మునుగోడు (Munugode Bypolls)లో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. మంత్రి కేటీఆర్ (Minister KTR) నిన్నటి నుంచే రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అటు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డితో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగస్తుండడంతో.. ఆదివారం నుంచి ముమ్మరంగా ప్రచారం నిర్వహించబోతోంది. ప్రతి గ్రామంలోనూ ముఖ్య నేతల ప్రచారానికి ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 11 మంది ముఖ్య నేతలతో ప్రచారం చేయనున్నారు. వీరి ప్రచార షెడ్యూల్‌ను స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్, సమన్వయకర్త గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ రూపొందించారు.
మునుగోడులో మొత్తం రెండు విడతలుగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. మొదటి దశలో రేపటి నుంచి రాష్ట్ర నేతలు, రెండో దశలో 25వ తేదీ నుంచి జాతీయస్థాయి నాయకులు ప్రచారం చేస్తారు. మునుగోడులో ప్రచారం చేసే వారి జాబితాలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, డీకే అరుణ, పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, విజయశాంతి, బాబూమోహన్ వంటి నేతలు ఉన్నారు. ప్రతి మూడు గ్రామాల్ని ఓ యూనిట్‌గా గుర్తించి.. అందులో పెద్ద గ్రామంలో ముఖ్యనేతతో ప్రచారం చేయిస్తారు. మిగిలిన గ్రామాల్లో ఇతర నేతలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఒక్కో నేత ఉదయం, సాయంత్రం రెండు గ్రామాల చొప్పున పర్యటిస్తారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sajay) ఈ నెల 18 నుంచి మునుగోడులోనే ఉంటారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు.. మొత్తం 74 గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన ఒక వైపు ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు నేతలతో సమావేశాలు, వ్యూహ రచన చేయనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రచారం చేస్తారు. మరో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇప్పటికే చౌటుప్పల్‌లో పర్యటించి.. ప్రచారం చేశారు. స్మృతి ఇరానీ, యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ప్రచారాన్ని తీసుకురావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 25 నుంచి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో బీజేపీ ఉంది. ఆ తర్వాత ఈ నెల 29న భారీ బహిరంగ సభను నిర్వహించాలని.. ఆ సభకు అమిత్ షా (Amit Shah) వచ్చే అవకాశముందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana